
బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ చిక్కుల్లో పడ్డారు. నిషేధ చట్టాన్ని ఆయన ఉల్లంఘించారని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) చర్యలకు సిద్ధమైంది. షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన తొలి సిరీస్ బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ లో రణ్‌బీర్ కపూర్ అతిథి పాత్రలో నటించారు. అయితే, ఒక సీన్‌లో ఈ-సిగరెట్‌తో ఆయన కనిపిస్తారు. భారత్‌లో ఎలక్ట్రానిక్ సిగరెట్ట నిషేధ చట్టం ఉంది. దీనిని ఆయన ఉల్లంఘించారని ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేర్కొంది.
బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌తో పాటు చిత్రనిర్మాతలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై చట్టపరమైన చర్యలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ సిద్ధమైంది. భారత్‌లో నిషేధించిన ఉత్పత్తులను నెట్‌ఫ్లిక్స్ ఎలా చూపించిందంటూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారిచేసింది. ఈ సిరీస్‌లో రణ్‌బీర్ కపూర్ ఎటువంటి చట్టబద్ధమైన హెచ్చరిక లేకుండా ఈ-సిగరెట్ తాగుతున్నట్లు చూపించారని లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ దాఖలు చేసిన ఫిర్యాదులో పపేర్కొన్నారు. నిషేధిత పదార్థాలను ఇలా ప్రోత్సాహించడం నేరం దాని ద్వారా యువతను తప్పుదారి పట్టించేలా ప్రభావితం చేస్తుందని తెలిపారు.
అయితే, ఈ వివాదం జరిగిన కొద్దిసేపటికే ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యులు ప్రియాంక్ కనూంగో స్పందించారు. 'భారతదేశంలో ఈ-సిగరెట్‌లు నిషేధం. ఇక్కడి చట్టం ప్రకారం ఏ వ్యక్తి కూడా ఈ-సిగరెట్లను ప్రోత్సహించకూడదు. ఎవరైనా భారత్‌లో వాటిని విక్రియించినా లేదా దిగుమతి చేసుకున్నా నేరం. కనీసం ఎలాంటి అమ్మకాలు జరిపేందుకు అనుమతి లేదు. రణ్‌బీర్ కపూర్‌తో పాటు నిర్మాణ సంస్థ, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాని ముంబై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశాం' అని చెప్పారు.