![Ratan Tata produced a Bollywood film starring Amitabh Bachchan](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/10/10/ratan_3.jpg.webp?itok=nmGGlyx4)
ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూప్ దిగ్గజం రతన్ నావల్ టాటా నింగికేగిశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు. మనదేశంలో దిగ్గజ వ్యాపారవేత్తగా పేరు గడించారు. ఆయన మృతి పట్ల దేశవ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు కూడా నివాళులర్పిస్తున్నారు.
అయితే రతన్ నావల్ టాటా కేవలం వ్యాపారవేత్త అని మనందరికీ తెలుసు. కానీ ఆయన కళాపోషణ కూడా ఉందన్నది చాలామందికి తెలియదు. కేవలం పారిశ్రామికవేత్తగానే కాకుండా.. రతన్ టాటాకు సినిమాలంటే అమితమైన ఆసక్తి. గతంలో అంటే 2004లో ఒక బాలీవుడ్ చిత్రానికి సహ నిర్మాతగా ఉన్నారు. అమితాబ్ బచ్చన్, జాన్ అబ్రహం, బిపాసా బసు నటించిన ఏట్‌బార్ అనే మూవీ నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. రతన్ టాటా ఈ చిత్రాన్ని జతిన్ కుమార్‌తో కలిసి టాటా బీఎస్ఎస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాకు విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
అయితే ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. బాలీవుడ్ స్టార్స్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద కష్టాల్లో పడింది. ఈ సినిమాను రూ. 9.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా.. కేవలం రూ.7.96 కోట్లు మాత్రమే వసూలు చేసింది. రతన్ టాటా నిర్మించిన ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment