
నేను ఎంతగానో ప్రేమించే నా తండ్రి స్వర్గానికి వెళ్లిపోయారు. నాకు, నా కుటుంబానికి పిల్లర్‌లా నిలబడేవారు అని ఎమోషనల్ అయింది. ప్రతిక్షణం నువ్వు నాతోనే ఉంటావ్ పప్పా.. ప్రతి అడుగూ నువ్వే వేయిస్తావు అని రాసుకొచ్చింది...
బాలీవుడ్ నటి రవీనా టండన్ ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి, రచయిత, దర్శకనిర్మాత రవి టండన్(86) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఆయన ముంబైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం 3.30 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. అదే రోజు సాయంత్రం బరువెక్కిన గుండెతో తండ్రి అంత్యక్రియలు నిర్వహించింది రవీనా టండన్. ఇక తండ్రి మరణవార్తను సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఎమోషనల్ అయింది నటి. 'నేను ఎంతగానో ప్రేమించే నా తండ్రి స్వర్గానికి వెళ్లిపోయారు. ఆయన నాకు, నా కుటుంబానికి మూలస్థంభంలా నిలబడేవారు' అని ట్వీట్ చేసింది
— Raveena Tandon (@TandonRaveena) February 11, 2022
'ప్రతిక్షణం నువ్వు నాతోనే ఉంటావ్ పప్పా.. ప్రతి అడుగూ నువ్వే వేయిస్తావు, నిన్నెప్పటికీ వదలను, లవ్ యూ పప్పా' అని ఇన్‌స్టాగ్రామ్‌లో తండ్రితో దిగిన పలు ఫొటోలను పంచుకుంది. కాగా రవి టండన్.. 'ఖేల్ ఖేల్ మేన్', 'అన్హోనీ, నజరానా', 'మజ్‌బూర్', 'ఖుడ్‌దార్', 'జిందగీ' వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎందరో స్టార్లతో కలిసి పని చేశారు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.