తెలుగు తెరపై పరభాషా తారలు చాలామంది కనిపిస్తుంటారు. తెరవెనక పరభాషా సాంకేతిక నిపుణులు పని చేస్తుంటారు. ముఖ్యంగా పలువురు పరభాషా సంగీతదర్శకులు టాలీవుడ్‌కి ట్యూన్ అయ్యారు. ఈ ఏడాది తెలుగు చిత్రాలకు ఎక్కువగా ఇతర భాషల సంగీతదర్శకులు ట్యూన్లు ఇస్తున్నారు. వారి గురించి తెలుసుకుందాం.
‘కేజీఎఫ్ 1, 2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నారు రవి బస్రూర్ (కన్నడ). ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’ చిత్రానికి, అలాగే సీనియర్ నటుడు హరనాథ్ సోదరుడు, నటుడు వెంకట సుబ్బరాజ్ తనయుడు హీరోగా పరిచయమవుతున్న ‘సీతామనోహర శ్రీరాఘవ’ చిత్రానికి కూడా రవి బస్రూర్ స్వరాలందిస్తున్నారు.
∙గతంలో ‘బిల్లా రంగా, గురు’ ఇటీవల ‘దసరా’ చిత్రాలకు సంగీతం అందించారు సంతోష్ నారాయణన్ (తమిళ్). ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’కి, వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్‌లో ప్రారంభమైన ‘సైంధవ్’ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
హీరోగా, సంగీత దర్శకునిగా కొనసాగుతున్న జీవీ ప్రకాశ్‌కుమార్ (తమిళ్) ఇప్పటికే తెలుగులో పలు చిత్రాలకు సంగీతం అందించారు. ప్రస్తుతం రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘టైగర్ నాగేశ్వరరావు’కి, నితిన్ హీరోగా వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న చిత్రానికి స్వరాలందిస్తున్నారు.
మాతృభాష మలయాళంలో ‘నోట్ బుక్’ (2006) ద్వారా సంగీతదర్శకుడిగా కెరీర్ ఆరంభించిన గోపీసుందర్ ‘మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు’ (2015) చిత్రంతో తెలుగుకి వచ్చారు. ఆ తర్వాత ‘భలే భలే మగాడివోయ్’, ‘మజ్ను’, ‘ప్రేమమ్’, ‘గీత గోవిందం’, ‘మజిలీ’ తదితర చిత్రాలకు స్వరాలందించారు. ఇటీవల రిలీజైన ‘18 పేజెస్’, ‘బుట్ట బొమ్మ’ చిత్రాలకు గోపీయే సంగీతదర్శకుడు.
∙‘అజ్ఞాతవాసి’ (2018), నాని ‘గ్యాంగ్‌లీడర్’ (2019) వంటి చిత్రాలకు తనదైన శైలిలో సంగీతం అందించారు అనిరుధ్ రవిచంద్రన్. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి స్వరాలందిస్తున్నారు.
‘జర్నీ’ (2011), ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’ (2013), ‘సిటిజన్’ (2013) వంటి డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్‌కి పరిచయమైన సి.సత్య (తమిళ్) ప్రస్తుతం స్ట్రెయిట్ తెలుగు చిత్రం చేస్తున్నారు. పవన్ కల్యాణ్– సాయిధరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి సత్యనే స్వరకర్త.
తమిళ చిత్రాలతో పాటు తెలుగు సినిమాలకూ తనదైన శైలిలో సంగీతం అందిస్తున్నారు హారీస్ జయరాజ్ (తమిళ్). ప్రస్తుతం ఆయన నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి, నాగశౌర్య కథానాయకుడుగా చేస్తున్న చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
∙‘కిరాక్ పార్టీ’ (2018) చిత్రంతో తెలుగులోకి సంగీత దర్శకునిగా ఎంట్రీ ఇచ్చారు అజనీష్ లోక్‌నాథ్ (కన్నడ). ఆ తర్వాత ‘నన్ను దోచుకుందువటే’ (2018) మూవీకి స్వరాలు అందించారు. నాలుగేళ్ల విరామం తర్వాత ఆయన తెలుగులో చేస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’. సాయిధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హేషమ్ అబ్దుల్ వహాబ్ ‘ఖుషి’ సినిమాతో తెలుగుకి వస్తున్నారు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. అలాగే నాని హీరోగా సౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి, శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న చిత్రానికి హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నారు.
మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా పాటలను 1980ల నుంచి తెలుగు శ్రోతలు వింటున్నారు. తెలుగు పరిశ్రమతో సుదీర్ఘ అనుబంధం ఇళయరాజాది. ఇటీవల విడుదలైన ‘రంగ మార్తాండ’కు ఆయనే స్వరకర్త. అలాగే త్వరలో విడుదల కానున్న ‘మ్యూజిక్ స్కూల్’కి కూడా స్వరాలందించారు.
ఇక ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా టాలీవుడ్ కెరీర్ ‘శేషు’ (2002) సినిమాతో ప్రారంభమై, కొనసాగుతోంది. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ‘కస్టడీ’ చిత్రానికి తండ్రి ఇళయరాజాతో కలిసి స్వరాలు అందించారు యువన్. అలాగే శర్వానంద్ హీరోగా చేయనున్న ఓ చిత్రానికి యువన్ శంకర్ స్వరాలందిస్తున్నారు. వీరే కాదు.. మరికొందరు ఇతర భాషల సంగీత దర్శకులు తెలుగు చిత్రాలకు ట్యూన్లు ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment