ఏయూక్యాంపస్: సినిమా సంగీతం రూపకల్పనకు వీలుగా విశాఖలోని భీమిలిలో రికార్డింగ్ స్టూడియోను నిర్మిస్తానని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ థమన్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సెయింట్ లూక్స్ సంస్థ సహకారంతో నూతనంగా నిర్మించిన ఆడియో రికార్డింగ్ స్టూడియో, తరగతి గదులను ఆదివారం ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డితో కలిసి థమన్ ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను మ్యూజిక్ ల్యాండ్‌గా భావిస్తున్నానని, విశాఖ కేంద్రంగా సినీ సంగీత ప్రయాణానికి ఇదో మంచి ఆరంభంగా నిలుస్తుందన్నారు. తనకు దేశ, విదేశాల్లో స్టూడియోలున్నాయని, త్వరలో విశాఖలోనూ స్టూడియో నిర్మిస్తానన్నారు. తన విశ్రాంత జీవితాన్ని ప్రశాంత నగరమైన విశాఖలో గడిపేందుకే తాను ఇష్టపడతానని తెలిపారు.
ఎంతో సుదీర్ఘ అనుభవం కలిగిన సంగీత దర్శకుడు ఆశీర్వాద్ లూక్స్ మార్గదర్శకంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆడియో ఇంజినీరింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్ అకాడమీని ప్రారంభించడం మంచి పరిణామమని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏయూను తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు చెప్పారు. సంగీత దర్శకుడు ఆశీర్వాద్ లూక్స్, సెయింట్ లూక్స్ సంస్థల అధినేత ప్రీతం లూక్స్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment