Republic Movie Review And Rating In Telugu | Sai Dharam Tej Republic Movie Review In Telugu - Sakshi
Sakshi News home page

Republic Review:‘రిపబ్లిక్‌’మూవీ రివ్యూ

Published Fri, Oct 1 2021 1:36 PM | Last Updated on Fri, Oct 1 2021 6:11 PM

Republic Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : రిపబ్లిక్‌
నటీనటులు :  సాయి తేజ్‌, ఐశ్యర్యా రాజేశ్‌, జగపతిబాబు, రమ్యకృష్ణ, ఆమని, సుబ్బరాజు, రాహుల్‌ రామకృష్ణ తదితరులు
నిర్మాణ సంస్థ : జీస్టూడియోస్‌, జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు :  జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు
దర్శకత్వం : దేవ్‌ కట్టా
సంగీతం :  మణిశర్మ
సినిమాటోగ్రఫీ : ఎం.సుకుమార్‌
ఎడిటింగ్‌:  కె.ఎల్‌.ప్రవీణ్
విడుదల తేది : అక్టోబర్‌ 1,2021

‘ప్రస్థానం’మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు దేవ్‌ కట్టా. ఆ తర్వాత ఇదే సినిమాను 2019లో హిందీలో తెరకెక్కించి బాలీవుడ్‌లో సైతం గుర్తింపు పొందారు. అలా వైవిధ్యమైన కోణంలో సినిమాలు తెరకెక్కించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. చాలా గ్యాప్‌ తర్వాత తనకు అచ్చొచ్చిన పొలిటికల్‌ జానర్‌లోనే ‘రిపబ్లిక్‌’ని తెరకెక్కించి  ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దేవ్‌ కట్టా. మెగా మేనల్లుడు సాయితేజ్‌ ఈ మూవీలో కలెక్టర్‌గా కనిపించబోతుండడంతో ‘రిపబ్లిక్‌’పై మెగా ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌ ఆ అంచనాలను మరింత పెంచాయి. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ శుక్రవారం(అక్టోబర్‌ 1)థియేటర్ల ద్వారా ప్రేక్షకులను ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘రిపబ్లిక్‌’మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? కలెక్టర్‌గా సాయితేజ్‌ మెప్పించాడా?లేదా? రివ్యూలో చూద్దాం. 



కథేంటంటే
1970లో స్వచ్ఛమైన తెల్లేరు సరస్సును రాజకీయ ప్రాబల్యం ఉన్న వ్యక్తులు  కబ్జా చేస్తారు. అప్పటి నుంచి స్వచ్ఛమైన ఆ సరస్సులో విషపు ఆహారాన్ని వేస్తూ చేపలను పెంచుతారు. దాని కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. అయినప్పటికీ ఆంధ్ర ప్రజా పార్టీ అధినేత్రి విశాఖవాణి(రమ్యకృష్ణ) తన వ్యాపారాన్ని వదులుకోదు.  ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రాజకీయంగా ఎదుగుతూ తన కొడుకుని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెడుతుంది. ఆ ప్రాంతానికి కలెక్టర్‌గా వచ్చిన పంజా అభిరామ్‌(సాయి తేజ్‌) తెల్లేరు సరస్సు ఆక్రమించినవారిపై చర్యలు తీసుకుంటాడు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న విశాఖవాణితో వైర్యం పెరుగుతోంది. ఇది ఎంతవరకు దారి తీసింది? నిజాయతీపరుడైన కలెక్టర్‌ అభిరామ్‌.. అవినీతి నాయకురాలైన విశాఖ వాణికి ఎలా బుద్ది చెప్పాడు?  తదనంతర పరిణామాలు ఏమిటీ? అనేదే ‘రిపబ్లిక్‌’ కథ.



ఎవరెలా చేశారంటే?
రిపబ్లిక్‌ మూవీ కోసం సాయితేజ్‌ ప్రాణంపెట్టి నటించాడు. అవినీతి పరుడైన తండ్రిని కాదని తన కాళ్లమీద తాను నిలబడే వ్యక్తిగా, నిజాయతీ గల కలెక్టర్‌ అభిరామ్‌ పాత్రలో సాయి తేజ్‌ అదరగొట్టేశాడు. ప్రాంతీయపార్టీ అధినేత్రిగా రమ్యకృష్ణ తనదైన నటనతో మెప్పించింది. ఇక అవినీతికి పాల్పడే గ్రూప్‌ 1 అధికారి దశరథ్ పాత్రలో జగపతిబాబు ఎప్పటిమాదిరే పరకాయప్రవేశం చేశాడు. అద్భుత ప‌ర్‌ఫార్మెన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక తప్పిపోయిన అన్నయ్యను వెత్తుకుంటూ అమెరికా నుంచి ఇండియా వచ్చిన యువతి మైరా(ఐశ్వర్య రాజేశ్‌) తన పాత్రకు న్యాయం చేసింది. అవినీతి ఎస్పీగా శ్రీకాంత్‌ అయ్యంగార్‌, కలెక్టర్‌గా సుబ్బరాజ్‌, జగపతిబాబు భార్యగా ఆమని, తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 
(చదవండి: ‘బిగ్‌బాస్‌’ఫేమ్‌ శ్వేత నటించిన ‘ది రోజ్‌ విల్లా’ ఎలా ఉందంటే..)



ఎలా ఉందంటే.. 
వ్య‌వ‌స్థ‌లోని లోటుపాట్ల‌ని త‌నదైన శైలిలో తెరపై చక్క‌గా చూపించాడు దర్శకుడు దేవ్‌ కట్టా. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ని ఎక్కడా డీవియేట్‌ కాకుండా ఫెర్పెక్ట్‌గా చెప్పాడు. రాజ్యాంగానికి మూల స్థంభాలైన శాస‌న వ్యవ‌స్థ‌, అధికార వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో  ఉందో తెరపై చక్కగా చూపించాడు. డైలాగ్స్‌ కూడా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఫస్టాఫ్‌ కాస్త నిదానంగా సాగిన‌ట్టు అనిపించినా, హీరో కల్టెర్‌ అయినప్పటి నుంచి అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. తెల్లేరు సరస్సు విషయంలో రైతుల పక్షాన ఉంటూ అభిరామ్‌ చేసే పోరాటం ఆకట్టుకుంటుంది. విశాఖ‌వాణికీ, అభిరామ్‌కీ మధ్య వచ్చే డైలాగ్స్‌, క్లైమాక్స్‌ సీన్స్‌ ఈ సినిమాకు హైలెట్‌ అని చెప్పాలి.అయితే సాధారణ ప్రేక్షకుడు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో లేకపోవడం సినిమాకు మైనస్‌. ఈ పొలిటికల్ డ్రామాకు వాణిజ్యపరమైన మెరుగులు అద్ది ఉంటే సినిమా మరోస్థాయికి వెళ్లేది. మ‌ణిశ‌ర్మ సంగీతం పర్వాలేదు. ఇందులో మూడే పాటలున్నాయి. అవికూడా తెచ్చిపెట్టినట్లుగా కాకుండా సందర్భానుసారంగా వస్తాయి. సుకుమార్ సినిమాటోగ్రఫి బాగుంది. మొత్తంగా  చెప్పాలంటే రొటీన్ కమర్షియల్ సినిమాలు చూడటానికి అలవాటు పడిన వారి సంగతి పక్కన పెడితే, పొలిటికల్ డ్రామాస్ ను ఇష్టపడే వారికి ‘రిపబ్లిక్’ నచ్చుతుంది.



ప్లస్‌ పాయింట్స్‌
కథ
సాయితేజ్‌, జగపతి బాబు, రమ్యకృష్ణ నటన
డైలాగ్స్‌, క్లైమాక్స్‌

మైనస్‌ పాయింట్స్‌
కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేకపోవడం
సరస్సు చుట్టూనే కథ తిరగడం
నిదానంగా సాగే సన్నివేశాలు
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement