న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సీబీఐ విచారించడం తనకెంతో సంతోషంగా ఉందని అతడి ప్రేయసి రియా చక్రవర్తి అన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె.. సుశాంత్ మరణం వెనుక గల అసలు కారణాలేమిటో తాను కూడా తెలుసుకోవాలనుకుంటున్నానన్నారు. జూన్ 8న తాను సుశాంత్ ఫ్లాట్‌ను వీడిన నాటి నుంచి జూన్ 14 వరకు మధ్యకాలంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందని, ఆ సమయంలో సుశాంత్ సోదరి అక్కడే ఉన్నారని చెప్పుకొచ్చారు. కాగా సుశాంత్ మృతి కేసులో సీబీఐ సమన్లు అందకోక మునుపు రియా ప్రముఖ జాతీయ మీడియాకు లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలు, వదంతుల కారణంగా కుటుంబం ఎంతో వేదన అనుభవిస్తోందని.. అందుకే ఇన్నాళ్ల తర్వాత తాను మౌనం వీడాలనుకుంటున్నట్లు తెలిపారు.(చదవండి: ‘బ్రేకప్ తర్వాత మాట్లాడలేదు.. వాళ్ల వైపే ఉంటా’ )
వివిధ ప్రశ్నలకు రియా స్పందన
సుశాంత్ మరణానికి గల కారణం ఏమిటి?
రియా: నేను కూడా ఇదే తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఈ కేసును సీబీఐ విచారించడం చాలా సంతోషంగా ఉంది. సుశాంత్ ఇంకా ఇక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది.
మీ ఇన్‌స్టా పోస్టులో సీబీఐ విచారణ కావాలని అన్నారు కదా. మీకున్న అనుమానాలు ఏమిటి? అసలు సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు?
నిజానికి నేను వచ్చిన తర్వాత అక్కడ(సుశాంత్ ఫ్లాట్) ఏం జరిగిందో తెలియదు. అది తెలుసుకోవాలనే సీబీఐ విచారణ అడిగాను. ఇంకో విషయం సీబీఐ ఎంటర్ కాకముందు నేను సుప్రీంకోర్టుకు వెళ్లాను. ముంబై పోలీసుల విచారణకు సహకరిస్తున్నా బిహార్ పోలీసులు రావడం నాకు గందరగోళంగా అనిపించింది.
ఈ వాట్సాప్ చాట్స్ చూడండి. గౌరవ్ ఆర్యాకు ఇచ్చిన మెసేజ్‌లో హార్డ్ డ్రగ్స్ తీసుకోలేదు. ఎండీఎంఏ ఒకసారి ట్రై చేశా అన్నారు. మీ దగ్గర ఎండీ(డ్రగ్) ఉందా? శామ్యూల్ మిరండా మీ తమ్ముడు షౌవిక్ దగ్గర స్టఫ్ ఉందా అని అడిగాడు. ఎందుకు?
నేనెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు. ఈ సంభాషణను ఖండిస్తున్నా. ఇప్పుడేం మాట్లాడినా ఎన్‌సీబీ(నార్కొటిక్) విచారణపై ప్రభావం పడుతుంది. డ్రగ్ టెస్టుకు నేను సిద్ధంగా ఉన్నా. నిజానికి సుశాంత్‌కు డ్రగ్స్ తీసుకునేవాడు. అతడు గంజాయి పీల్చేవాడు. తన చుట్టూ ఉన్నవాళ్లను అడిగితే మీకు చాలా విషయాలు తెలుస్తాయి.
అవునా. సుశాంత్ డ్రగ్స్ తీసుకుంటాడని మీకెప్పుడు తెలిసింది?
నన్ను కలిసే కంటే ముందు నుంచే అతడికి ఈ అలవాటు ఉంది. నాకు తెలిసి కేదార్‌నాథ్ షూటింగ్ సమయంలో అనుకుంటా అలవాటు చేసుకున్నాడు. మానుకోమని చెప్పడం వరకే నా పాత్ర. ఈ విషయం గురించి సుశాంత్ మేనేజర్ శ్రుతి మోదీతో నేను చాలా సార్లు చర్చించాను. (చదవండి: రియాపై సీబీఐ ప్రశ్నల వర్షం)
సుశాంత్ హంతకురాలు మీరరేనని ఆయన తండ్రి అంటున్నారు కదా? ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది.
ఇదే వాళ్ల చివరి అస్త్రం. సుశాంత్ ఐదుగురు సైక్రియార్టిస్టులను కలిశాడు. నేను అధిక మోతాదులో మెడిసిన్ ఇచ్చాననడం అబద్ధం. తను జనవరిలోనే చికిత్స ఆపేశాడు. ఇక విష ప్రయోగం అనేదాని కంటే మరో చెత్త ఆరోపణ ఏమీలేదు. నిజానికి నేను తనతో థెరపీ సెషన్‌కు వెళ్లి బయటే కూర్చునేదాన్ని అంతే. మందుల విషయంలో నాకేమీ తెలియదు.
సుశాంత్‌కు, తన తండ్రికి మధ్య బంధం ఎలా ఉండేది?
సుశాంత్ వాళ్ల నాన్న తనను వదిలేశాడు. ఐదేళ్లుగా తన తండ్రిని కలవలేదని చెప్పాడు. నిజానికి తనకు వాళ్ల అమ్మ అంటేనే చాలా ఇష్టం.
మహేష్ బట్‌తో మీ వాట్సాప్ చాట్ గురించి? మీ జీవితంలో జరిగే అన్ని విషయాలు ఆయనకు తెలుసా?
‘‘భట్ సాబ్ నాకు తండ్రిలాంటి వారు. యాంగ్జైటీతో నేను బాధపడేదాన్ని. ఏడాది కాలంగా జాగ్రత్తగా కాపాడుకున్న నా బాయ్‌ఫ్రెండ్ నన్ను ఇంటికి వెళ్లిపొమ్మన్నాడు. తను కూర్గ్ వెళ్లాలనుకున్నాడు. జనవరిలో పవ్నాకు షిఫ్ట్ అవుదామనుకున్నాడు. తన సోదరి మీతూ అక్కడికి వస్తా అన్నారు. ఇంక నేను అక్కడ ఉండాల్సిన అవసరం లేదనుకున్నా. ఒకవేళ వాళ్ల ఫ్యామిలీ తనను చూసుకుంటే నేనెందుకు జోక్యం చేసుకునేదాన్ని. సుశాంత్‌ను ప్రేమించినందుకు, తనను జాగ్రత్తగా చూసుకున్నందుకు నా దక్కిన బహుమానం ఈ ఆరోపణలు. నాకు సుశాంత్ ఎన్నడూ డబ్బు ఇవ్వలేదు’’ అని రియా చెప్పుకొచ్చారు.
ఇక సుశాంత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే తనను తాను సుశాంత్ విడోనని చెప్పుకుంటోందని, అతడు ఇచ్చిన డబ్బుతో ఫ్లాట్ కొన్న విషయం ఏమైందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. రియా శుక్రవారం సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. సుశాంత్‌తో పరిచయం నాటి అతడి ఫ్లాట్ విడిచివెళ్లేంత వరకు జరిగిన పరిణామాల గురించి ఆమెను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment