‘టక్ జగదీష్’కచ్చితంగా థియేటర్ సినిమానే. బిగ్ స్క్రీన్‌లో చూసిన ఎక్స్ పీరియన్స్ వేరేలా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా నిర్మాతలు ఓటీటీ నిర్ణయాన్ని తీసుకున్నారు. కానీ కచ్చితంగా థియేటర్లో చూసిన ఫీలింగ్‌ను మాత్రం మిస్ అవుతాం’అన్నారు హీరోయిన్ రీతూ వర్మ. నేచురల్ స్టార్ నాని, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘టక్ జగదీష్’. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'నిన్నుకోరి' వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా రీతూ వర్మ చెప్పిన విశేషాలు..
► ఇప్పటి వరకు చేసిన పాత్రలు, సినిమాల్లో కెల్లా ఇది ప్రత్యేకం. పూర్తిగా కమర్షియల్ సినిమాలో నటించాను. ప్రభుత్వాధికారిగా గుమ్మడి వరలక్ష్మీ పాత్రలో నటించాను. గవర్నమెంట్ ఆఫీసర్‌గా తన అధికారాన్ని చూపించే పాత్ర అది. పాత్రలో చాలా అమాయకత్వం కూడా ఉంటుంది. మనసులో ఏముంటే అదే మాట్లాడే అమ్మాయి. ట్రెడిషన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి.. తాను కరెక్ట్ అనుకునే దాని కోసం పోరాడే పాత్రలో నటించాను.
► ఇది కచ్చితంగా థియేటర్ సినిమానే. బిగ్ స్క్రీన్‌లో చూసిన ఎక్స్ పీరియన్స్ వేరేలా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా నిర్మాతలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కానీ కచ్చితంగా థియేటర్లో చూసిన ఫీలింగ్‌ను మాత్రం మిస్ అవుతాం. ఇప్పుడు ఓటీటీ కూడా మంచి ఫాంలో ఉంది. లాక్‌డౌన్ సమయంలో ఓటీటీ మీద మనం ఆధారపడ్డాం. అదే మనకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఓటీటీలో టక్ జగదీష్ సినిమా విడుదలవుతుండటంతో ఒకేసారి ఎంతో మంది చూసే అవకాశం ఉంది.
► సాధారణంగా సిటీ అమ్మాయిని. ఎప్పుడూ కూడా గ్రామాల్లోకి వెళ్లలేదు. ఉండలేదు. కానీ నేను మనుషులను ఎక్కువగా గమనిస్తుంటాను. ఎక్కడో చూసిన విషయాలు అలా గుర్తుండిపోతాయి. పైగా నేను దర్శకుడు చెప్పింది చేసే నటిని. ఈ పాత్ర కోసం శివ నిర్వాణ గారే ఇన్ పుట్స్ ఇచ్చేశారు. ఆ పాత్రకు సంబంధించిన క్యాస్టూమ్ ధరించగానే పాత్రలోకి వెళ్లినట్టు అనిపిస్తుంది.
► నానితో ఇది రెండో సారి నటించడం. మొదటగా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించాను. కానీ అందులో నాది చిన్న పాత్ర. అంతగా ఇంటరాక్షన్ అవ్వలేదు. నేను కూడా అప్పుడే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాను. కానీ ఈ సారి మాత్రం నానితో ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చింది. ఎంతో నేర్చుకున్నాను. సినిమా, జీవితం వంటి వాటి మీద నానికి ఎక్కువ నాలెడ్జ్ ఉంది. నాని మాట్లాడితే అలా వినాలనిపిస్తూనే ఉంటుంది. అయనెంతో సపోర్ట్ చేశారు.
► నాని సెల్ప్ మేడ్ స్టార్. ఆయన గ్రాఫ్ అలా పెరుగుతూనే వస్తోంది. ప్రతీ సినిమాతో ప్రేక్షకుడికి ఏదో ఒక కొత్త ఫీలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. నానిలో నచ్చిన విషయం అదే. ఎవడే సుబ్రహ్మణ్యంలో నాని, టక్ జగదీష్‌లో నానికి ఉన్న వ్యత్యాసం చెప్పేంత స్థాయి నాకు లేదు. నాని నటన అంటే ఇష్టం, ఆయన ఎంచుకునే కథలు ఇష్టం. మరోసారి ఆయనతో కలిసి నటించాలని ఉంది.
► టక్ జగదీష్ కమర్షియల్ సినిమా అయినా కూడా రియలిస్టిక్‌గా ఉంటుంది. ఓవర్ యాక్షన్, డ్రామా సీన్లు ఉండవు. సటిల్ యాక్షన్ ఉంటుంది. ఇందులో చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. ప్రతీ క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది. యూనిక్‌గా ఉంటుంది. కచ్చితంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది.
► శివ నిర్వాణ సినిమా అంటే ఎమోషన్స్ కచ్చితంగా ఉంటాయి. నిన్నుకోరి, మజిలి సినిమాలు చూసినప్పుడు శివ నిర్వాణ గారితో పని చేయాలని అనుకున్నాను. నాకు డ్రామా ఎమోషనల్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం.
► టక్ జగదీష్‌లో కామెడీ కూడా ఉంటుంది. అన్ని ఎమోషన్స్ ఉంటాయి. నానికి, నాకు ఉన్న సీన్స్‌లోనూ చిరునవ్వును తీసుకొస్తుంది. టక్ జగదీష్ తరువాత ఇంకా మంచి ఆఫర్లు వస్తాయని ఆశిస్తున్నాను. ఈ మూవీతో ఓ వర్గం ప్రేక్షకులకు మరింత దగ్గరవుతాను. నేను ఎక్కువగా అర్బన్ ఫిల్మ్స్, మల్టీ ప్లెక్స్ సినిమాలు చేశాను. కానీ ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మరింత దగ్గరవుతాను.
►ఓ నటిగా నేను భిన్న పాత్రల్లో నటించాలని కోరుకుంటాను. అయితే నా పాత్రకు ఏ మాత్రం ప్రాముఖ్యత ఉందని చూస్తాను.. నా పాత్ర కథకు బలమైందిగా ఉందా? లేదా? అని ఆలోచిస్తాను. అంతే కానీ నేను పలాన పాత్రలను చేయను అని ఏమీ లేదు. అన్ని రకాల పాత్రలను చేసేందుకు నేను సిద్దంగానే ఉన్నాను.
►వరుడు కావలెను అక్టోబర్‌లో రిలీజ్ కానుంది. ఆ తరువాత ద్విభాష చిత్రం ఒకే ఒక జీవితం, మరో తమిళ సినిమాకు సైన్ చేశాను. వెబ్ సిరీస్ కోసం చర్చలు జరుగుతున్నాయి. నాకు డ్యాన్సులు చేయడం, పాటలు పాడటం, ఎంజాయ్ చేసే పాత్రలను పోషించడం అంటే ఇష్టం. కానీ నాకు ఎక్కువగా అలాంటి అవకాశాలు రాలేదు. కానీ వరుడు కావలెనులో వచ్చింది.
►ప్రస్తుతానికి అయితే నటన మీదే దృష్టి పెట్టాను. కానీ నాకు సినిమాలు తీయాలని ఉంది. ఓటీటీ కోసం చిన్న సినిమాలను తీయాలని అనుకుంటున్నాను. కో ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నాను.
►తినడం ఇష్టం. వంటలు వండటం కూడా ఇష్టం. కానీ అప్పుడప్పుడే వండుతాను. అమ్మ మాంసాహారి, నాన్న శాకాహారి. నేను రెస్టారెంట్లకు ఎక్కువగా వెళ్తాను.. వెరైటీ ఫుడ్‌లను టేస్ట్ చేస్తుంటాను.
Comments
Please login to add a commentAdd a comment