చెన్నై : హీరో విశాల్ బీజేపీలోకి చేరడానికి సిద్ధమవుతున్నట్లు, అందుకుగానూ ఆయన రాష్ట్ర ఆ పార్టీ అధ్యక్షుడు మురుగన్‌తో భేటీకి అపాయింట్‌మెంట్ కోరినట్లు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. విశాల్‌కు రాజకీయరంగ ప్రవేశం చేయాలనే ఆకాంక్ష చాలా కాలంగానే ఉంది. ఆ మధ్య ఉప ఎన్నికల్లో ఆర్.కె.నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని విశాల్ ప్రయత్నించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. కాగా గతంలో జరిగిన తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లోనూ అధ్యక్షుడిగానూ, దక్షిణ భారత ఎన్నికల సంఘంకు కార్యదర్శిగానూ విశాల్ విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల కొన్ని కారణాల వల్ల మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిన విశాల్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఈమధ్య ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ వ్యవహారంలో నటి కంగనారనౌత్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేసింది. ( సినిమాను ఏలింది చాలు.. రాజకీయాల్లోకి రండి! )
ఈ అమ్మడు ముంబయి పోలీసులపై పలు ఆరోపణలు చేసింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం కంగనాపై ఆగ్రహంతో మండిపోతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో నటుడు విశాల్ సంచలన నటి కంగనారనౌత్‌ను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఆమెను భగత్ సింగ్‌తో పోల్చారు. ఇకపోతే కంగనారనౌత్‌కు బీజేపీ అండగా నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో నటి కంగనా రనౌత్‌కు మద్దతు తెలిపిన విశాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మురుగన్‌ను 14 లేదా, 15వ తేదీన భేటీ కావడానికి అపాయింట్‌మెంట్ కోరారు. ఈనేపథ్యంలో ఈయన త్వరలో బీజేపీ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే తను బీజేపీ పార్టీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నటుడు విశాల్ కొట్టిపారేశారు.
Comments
Please login to add a commentAdd a comment