చీరతోనే అందం అంటున్న సాయి పల్లవి! | sai pallavi saree bollywood movie | Sakshi
Sakshi News home page

చీరలు ధరించడమే ఇష్టం: సాయి పల్లవి

Published Tue, Jul 23 2024 1:41 PM | Last Updated on Tue, Jul 23 2024 1:55 PM

sai pallavi saree bollywood movie

చీరలో ఉన్న స్త్రీల అందం మరే దుస్తుల్లోనూ కనిపించదంటారు. అందుకే స్త్రీలకు చీరే అందం అనే నానుడి కూడా ఉంది. నటి సాయి పల్లవి కూడా ఈ కోవకు చెందిన వారే. పాశ్చాత్య పోకడలు శృతిమించుతున్న ఈ రోజుల్లో కూడా తనకు చీరలు ధరించడంలోనే  సౌకర్యం అంటున్నారీ భామ. సాయి పల్లవి నటించే కథా పాత్రలు కూడా సంప్రదాయ రీతిలోనే ఉంటాయన్నది గమనార్హం. ప్రేమమ్‌ అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన తమిళ అమ్మాయి సాయి పల్లవి. 

ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో నటించి పాపులర్‌ అయిన ఈమె ఇప్పుడు బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సాయి పల్లవి గ్లామర్‌కు దూరం అన్న విషయం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే ముఖానికి మేకప్‌ వేసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఇక చిత్రాల్లో అయినా బయట ప్రపంచంలో నైనా ఈమె కనిపించేది చీరలో లేదా చుడిదార్‌లోనే. ముఖ్యంగా సినీ వేడుకల్లో పాల్గొనేటప్పుడు సాయి పల్లవి సంప్రదాయబద్ధంగా చీరలే ధరిస్తారు. వేడుకల్లో కూడా చీరలే ధరించి రావడం గురించి ప్రశ్నిస్తే తనకు చీరలే సౌకర్యంగా ఉంటాయని బదులిచ్చారు. పబ్లిక్‌ ఫంక్షన్‌లో పాల్గొన్నప్పుడు ఒక రకమైన తెలియని ఒత్తిడి కలుగుతుందన్నారు. 

అలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఏమి మాట్లాడాలన్న విషయంపైనే మనసు లగ్నమై ఉంటుందని, దుస్తులపై దృష్టి పెట్టడం కుదరదని అన్నారు. అలాంటప్పుడు చీర ధరించడమే సౌకర్యంగా ఉంటుందని భావిస్తానన్నారు. అలా ఒత్తిడి అనిపించే వేడుకల్లో తాను చీర ధరించి పాల్గొనడానికి ఇష్టపడతానని నటి సాయి పల్లవి పేర్కొన్నారు. కాగా మలయాళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె తమిళంలో శివ కార్తికేయన్‌ సరసన నటించిన అమరన్‌ త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. అలాగే నాగచైతన్యకు జంటగా నటిస్తున్న తెలుగు చిత్రం తండేల్‌ కూడా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం హిందీ చిత్రం రామాయణంలో నటిస్తున్నారు. ఇందులో ఈమె సీతగా నటిస్తున్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement