బాలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌.. కానీ తెలుగులో! | Sakshi Interview With Senior Director k Rushender Reddy In Telugu | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌గా.. కానీ తెలుగులో!

Published Wed, Nov 11 2020 8:34 AM | Last Updated on Wed, Nov 11 2020 9:04 AM

Sakshi Interview With Senior Director k Rushender Reddy In Telugu

ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది సామెత.. అయితే మన రాష్ట్రంలోని కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన దర్శకుడు కె. రుషేందర్‌రెడ్డి అలియాస్‌ కేఆర్‌ రెడ్డి మాత్రం రచ్చ గెలిచి ఇంట్లో అడుగుపెట్టారు. ఒక తెలుగోడు బాలీవుడ్‌ అగ్రహీరోలతో సూపర్‌డూపర్‌ హిట్స్‌ తీశాడు అంటే నమ్మగలరా.. ఇప్పటి చాలామంది దర్శకులకు తెలియని విషయం. కానీ కేఆర్‌ రెడ్డి మాత్రం 90వ దశకంలో మాస్‌ డైరెక్టర్‌గా అక్కడ మెరిశారు. ఇప్పుడు తెలుగులో సినిమాను ప్రయత్నిస్తున్న అలనాటి మేటి డైరెక్టర్‌ కేఆర్‌ రెడ్డి తన అనుభవాలను సాక్షితో పంచుకున్నారు.    
– బంజారాహిల్స్‌  

ఆ రోజుల్లో చదువుకుందామని ముంబై వెళ్లిన కేఆర్‌ రెడ్డి సమయం దొరికినప్పుడల్లా బాలీవుడ్‌ సినిమా షూటింగ్స్‌ చూసేందుకు వెళ్తుండేవారు. దాంతో హీరో అవ్వాలని ప్రయత్నం చేశారు. కానీ అతడి మనసు దర్శకత్వం వైపు మళ్లింది. ప్రారంభంలో దర్శకులు కే.రాఘవేంద్రరావు వద్ద కొద్ది రోజులు అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత బాలీవుడ్‌ సినిమాను ప్రయత్నించారు. మల్టీస్టారర్‌ సినిమాలను ఆ కాలంలోనే అగ్రహీరోలతో తీసి పలువురికి మార్గదర్శకంగా నిలిచారు. డ్రామాలు, మోనోయాక్టింగ్, పాటలు పాడటంలోనూ ఆయన నేర్పరి. ప్రెండ్స్‌ యూత్‌ క్లబ్‌ను ఏర్పాటుచేసి పలు విభిన్న కార్యక్రమాలను నిర్వహించేవారు. తెలుగుతో ఓ మంచి కథతో త్వరలో మీ ముందుకు వస్తాను అని చెబుతున్నారు.  చదవండి: ‘అక్కినేని’కి రూ.5 వేలకు ఎకరా చొప్పున ఇచ్చారు

బాలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌గా, మల్టీస్టారర్‌ డైరెక్టర్‌గా గుర్తింపుపొందిన కేఆర్‌ రెడ్డి 1986లో బాలీవుడ్‌ టాప్‌ హీరోస్‌ ధర్మేంద్ర, గోవింద, శక్తికపూర్, అనుపమ్‌ఖేర్, ఫరాలతో కలిసి నిర్మించిన ‘పాప్‌ కో జలాకర్‌ రాక్‌ కర్‌దూంగా‘ అనే సినిమా తీసి అందరి మన్ననలు అందుకున్నారు. మన తెలంగాణవాసి తన మొదటి సినిమాతోనే బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించడమే కాకుండా బెస్ట్‌ఫిలిం డైరెక్టర్‌గా గుర్తింపు పొందారు. శతృజ్ఞసిన్హ, గోవింద, పూనం దిలాన్, శక్తికపూర్‌తో కలిసి నిర్మించిన ‘మొహబ్బత్‌ కీ ఆగ్‌’ అనే సినిమాకు దర్శకత్వం వహించి బాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఇక స్టార్‌ హీరోయిన్‌ రేఖ, జితేందర్, రిషి కపూర్, మాధవి, మందాకిణిలతో తీసిన శేష్‌నాగ్‌ సినిమా బాక్సాఫీస్‌ బద్దలుకొట్టింది. 

ధర్మేంద్ర, ఆదిత్య పంచోలి, ఫరా, కుల్బూషన్‌ కర్బందాతో కలిసి నిర్మించిన వీరు దాదా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. హిందీలో శ్రీదేవి, వినోద్‌ఖన్నా, రిషీ కపూర్, అమ్రీష్‌ పూరితో తీసిన ‘గర్జన’ ఇండస్ట్రీ హిట్‌ కొట్టింది. మొత్తం 12 బాలీవుడ్‌ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించి తెలుగోడి సత్తాను ముంబై గడ్డ మీద చాటిచెప్పారు. మాస్‌ కమర్షియల్‌ ఫిలిం డైరెక్టర్‌గా బాలీవుడ్‌లో గుర్తింపు పొందారు. ఆ తర్వాతే తన పుట్టిల్లు టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. కృష్ణతో ‘నా ఇల్లే.. నా స్వర్గం’, దివ్యభారతితో ‘తొలిముద్దు’ సినిమాలకు దర్శకత్వం వహించారు. మొదటి సినిమాకే బెస్ట్‌ ఫిలిం డైరెక్టర్‌ అవార్డ్, వీరుదాదాకు ఫిలింఫేర్‌ అవార్డు, ముంబై అకాడమీ అవార్డులతో పాటు సత్కారాలను సొంతం చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement