టైటిల్: సాక్షి
నటీనటులు: శరణ్ కుమార్, జాన్వీర్ కౌర్, నాగబాబు, ఆమని, ఇంద్రజ తదితరులు
నిర్మాత: మునగాల సుధాకర్ రెడ్డి
దర్శకత్వం : శివ కేశన కుర్తి
సినిమాటోగ్రఫీ : చైతన్య కందుల
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఎడిటర్ : సెల్వ కుమార్
విడుదల తేది: జులై 29, 2023
ఇప్పటికే సూపర్‌స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి అనేక మంది హీరోలు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి సత్తా చాటారు. సీనియర్ నరేష్ బావ కుమారుడు శరణ్ కుమార్ కూడా గతంలో హీరోగా మిస్టర్ కింగ్ అనే ఒక సినిమా చేశాడు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా రిలీజ్ అయిన సాక్షి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు శరణ్ కుమార్. శివ కేశన కుర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.3గా మునగాల సుధాకర్ రెడ్డి నిర్మించారు. నాగబాబు, ఆమని, ఇంద్రజ, దేవీ ప్రసాద్ వంటి సీనియర్ నటులు నటించిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
సాక్షి కథేంటంటే..
అర్జున్(శరణ్ కుమార్) ఒకపక్క సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తూనే పత్రిక నడిపే తన తండ్రి (దేవీ ప్రసాద్)కి చిన్న చిన్న పనులు చేసి పెడుతూ ఉంటాడు. ఆఫీసులో మేనేజర్ నుంచి ఎదురైన ఒక అనూహ్యమైన ఇబ్బందితో బాధపడుతున్న సమయంలో పరిచయమైన రిపోర్టర్ నేత్ర (జాన్వీర్ కౌర్)తో ప్రేమలో పడతాడు. అంతా బాగానే ఉంటుందనుకున్న సమయంలో తండ్రి రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. ఆయనకు ఆపరేషన్ చేయాలంటే 20 లక్షలు కావాలి అనడంతో తెలియకుండానే ఒక స్మగ్లింగ్ ఊబిలో కూరుకుపోతాడు. ముందుగా స్మగ్లింగ్ చేయాల్సి వస్తుంది. తర్వాత మర్డర్ కేసులు కూడా మీద పడతాయి. ఆ స్మగ్లింగ్ నుంచి మర్డర్ కేసుల నుంచి అర్జున్ ఎలా తప్పించుకున్నాడు? హాస్పిటల్ లో ఉన్న తండ్రిని కాపాడుకున్నాడా? చివరికి నేత్ర, అర్జున్ ఒకటయ్యారా ? అనేది సినిమా కథ.
ఎలా ఉందంటే?
సాక్షి అనే పేరుతోనే ఆసక్తి రేకెత్తించిన సినిమాను ఏదో కొత్త కథతో తెరకెక్కించలేదు. రొటీన్ గా మనం చూసే సినిమా లాగానే ఉంటుంది కానీ ఎవరు టచ్ చేయని సబ్జెక్టులను టచ్ చేసి కమర్షియల్ ఎలిమెంట్లతోని స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు సినిమా యూనిట్. డబ్బు కోసం దేనికైనా దిగజారిపోతున్న రాజకీయ నాయకుల నుంచి నిజాయితీగా పోరాడే తన తండ్రి లాంటి జర్నలిస్టుని ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కొడుకు ఎలా కాపాడుకున్నాడు అనే విషయాన్ని ఇంటరెస్టింగ్ గా తెరకెక్కించారు.
అప్పటివరకు సుకుమారంగా అన్నింటికీ దూరంగా పెరిగిన ఒక వ్యక్తి తన తండ్రి ప్రాణాల మీదకు వస్తే తెగించి ఎంతవరకు పోరాడాడు అనే విషయాన్ని సినిమాలో కరెక్ట్ గా క్యాప్చర్ చేశారు. కథ రొటీన్ అయినా స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసేందుకు దర్శకుడు ప్రయత్నించి కొంత వరకు సఫలం అయ్యాడు. సీనియర్ నటీనటులు ఈ సినిమాకి అదనపు బలంగా మారారు. హీరో, హీరోయిన్లు స్క్రీన్ కి కొత్తయినా తమదైన శైలిలో నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
డైరెక్టర్ శివ తాను చెప్పాలనుకున్న విషయాన్ని కమర్షియల్ ఎలిమెంట్లతో ఒక మెసేజ్ ఇచ్చేలా చెప్పేందుకు ప్రయత్నించి కొంతవరకు సఫలం అయ్యాడు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అసలు అర్జున్ స్మగ్లింగ్ ఎందుకు చేయాల్సి వస్తుందనే విషయాన్ని చూపించగా సెకండ్ హాఫ్ అంతా ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ చేయడానికి ప్లాన్ చేశారు. సెకండ్ హాఫ్ తర్వాత సినిమా కథ ఒక్కసారిగా ఊపందుకుంటుంది. వరుస ట్విస్టులతో సినిమా మీద ఆసక్తి పెంచేశాడు డైరెక్టర్.
ఎవరెలా చేశారంటే?
నటీనటుల విషయానికి వస్తే శరన్ మొదటి సినిమా కంటే ఈ సినిమాలో నటన విషయంలో మెరుగయ్యాడు. జాన్వీర్ కౌర్ కి కూడా నటనకు స్కోప్ ఉన్న రోల్ దక్కింది.. విలన్ గా నాగబాబు ఒక రేంజ్ లో నటించాడు. తన అనుభవం అంత స్క్రీన్ మీద కనిపించింది. ఇంద్రజ, ఆమని, దేవి ప్రసాద్ వంటి వారి పాత్రలకు కూడా ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరికింది. వారు కూడా తమ అనుభవం స్క్రీన్ మీద పండించారు.
ఇక మిగతా నటీనటులు కూడా తమ తమ పాత్రల పరిధి మేర నటించారు. ఇక సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్టుగా సరిపోయింది. భీమ్స్ అందించిన సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది. అయితే ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి ప్లస్ అయింది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి తగినట్టు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment