
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ముంబై పోలీస్ కంట్రోల్ రూంకి ఫోన్ చేసిన ఆ వ్యక్తి ఈనెల 30న సల్మాన్‌ను చంపేస్తానని బెదిరించాడు. రాకీ భాయ్‌గా తనను పరిచయం చేసుకున్న అతను తనది రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ అని చెప్పాడట. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అప్రమత్తమైన పోలీసులు సల్మాన్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా సల్మాన్ ఖాన్‌కు హత్యా బెదిరింపులు రావడం ఇదేం మొదటిసారి కాదు. గత నెలలోనూ రెండుసార్లు సల్మాన్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ వచ్చాయి. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ ఎదుర్కొన్న సల్మాన్‌ను హత్య చేస్తానంటూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కోర్టు ఆవరణలోనే బెదిరించిన సంగతి తెలిసిందే.
పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాను చంపినట్లే సల్మాన్‌ను కూడా చంపేస్తామని బిష్ణోయ్ సన్నిహితుడు బెదిరించాడు. తాజాగా మరోసారి సల్మాన్ హత్యా బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. కొన్నిరోజులుగా కట్టుదిట్టమైన భద్రత మధ్యే బయటకు వెళ్తున్నారు. ఈ పరిణామాల మధ్య రీసెంట్‌గా సల్మాన్ హై సెక్యూరిటీ బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment