నచ్చితే ఆకాశానికెత్తేయడం, నచ్చకపోతే పాతాళానికి పడేయడం సోషల్ మీడియాలో నెటిజన్లకు బాగా అలవాటు. సెలబ్రిటీల కట్టుబొట్టు నచ్చలేదంటే చాలు వారిని చీల్చి చెండాడుతారు. అదేం డ్రెస్, ఇదేం హెయిర్‌స్టైల్ అంటూ వాళ్లను నానామాటలు అంటారు. తాజాగా సమంత కూడా ఈ ట్రోలింగ్ బారిన పడింది. క్రిటిక్స్ చాయిస్ ఫిలిం అవార్డుల ఫంక్షన్‌కు గ్రీన్ గౌన్‌లో హాజరైన ఆమె లుక్ చాలామందికి నచ్చలేదు. దీంతో ఆమె డ్రెస్సింగ్ స్టయిల్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. వ్యక్తిగతంగానూ ఆమెను హర్ట్ చేస్తూ కామెంట్లు చేశారు. దీంతో చిర్రెత్తిపోయిన సామ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ట్రోలింగ్‌పై అగ్గిమీద గుగ్గిలమైంది.
'ఒక మహిళగా నిర్ణయాన్ని చెప్పడం అంటే ఏంటో నాకు తెలుసు. మహిళల దుస్తులు, చదువు, సామాజిక స్థితి, వారి రూపురేఖలు, కలర్.. ఇలా ఎన్నోరకాలుగా వారిపై కామెంట్లు చేస్తూ వివక్షను చూపుతుంటారు. మహిళలు వేసుకునే బట్టల ఆధారంగా చాలా ఈజీగా వారిని జడ్జ్ చేస్తుంటారు. మనం 2022వ సంవత్సరంలో ఉన్నాం. ఇప్పటికైనా మహిళలను జడ్జ్ చేయడం ఆపరా? వారు ఎలాంటి బట్టలు వేసుకున్నారు? ఎలా కనిపిస్తున్నారనేదాన్ని బట్టే స్త్రీలను అంచనా వేయడం మానేసి మనపై మనం దృష్టి సారించగలమా? మీ అభిప్రాయాలను రుద్దడం వల్ల ఎవరికీ మేలు జరగదు' అంటూ సుదీర్ఘ పోస్ట్ షేర్ చేసింది సామ్. కాగా సోషల్ మీడియాలో తన పట్ల జరుగుతున్న ట్రోలింగ్‌పై బాధపడి సమంత ఈ పోస్ట్ చేసినట్లు కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment