హీరో సంపూర్ణేష్ బాబు మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఇద్దరు ఆడపిల్లలకు ఆర్థిక సాయం అందించడమే కాకుండా, వారి బాధ్యత తీసుకుని చదివించేందుకు ముందుకు వచ్చి రియల్ హీరో అనిపించుకున్నారు. కాగా చిన్న హీరో అయినప్పటికీ సంపూ ఇప్పటికే వరదలు, విపత్తుల సమయంలో తన వంతు ఆర్థిక సాయం అందిస్తూ ప్రభుత్వాలకు అండగా నిలిచారు.
ఇటీవల జర్నలిస్టు టీఎన్‌ఆర్ మృతి అనంతరం ఆయన కుటుంబానికి రూ. 50 వేలు అర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే. తాజాగా దుబ్బాకకు చెందిన నరసింహ చారి దంపతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడంతో వారి ఇద్దరూ కూమార్తెలు అనాథలుగా మారారు. ఈ వార్త చూసి చలించిన సంపూర్ణేష్ బాబు తక్షణమే వారికి 25 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు.
ఇదే విషయాన్ని ఆయన తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేస్తూ.. ‘దుబ్బాకలో నరసింహాచారి దంపతుల ఆత్మహత్య వార్త విని నా హృదయం కలిచివేసింది. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ పిల్లలకు నేను, మా నిర్మాత సాయి రాజేష్‌లు కలిసి రూ. 25వేల ఆర్థిక సాయం అందించాం. అంతేగాక వారి చదువుకు అయ్యే పూర్తి ఖర్చులను కూడా మేమే చూసుకుంటామని వారికి మాట ఇవ్వడం జరిగింది’ అంటూ ఆయన రాసుకొచ్చారు. కాగా ప్రస్తుతం సంపూ.. ‘బజారు రౌడీ, క్చాలీఫ్లవర్, పుడింగి నంబర్ వన్’ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. 2019లో విడుదలైన కొబ్బరిమట్ట చిత్రంతో సంపూ హిట్ అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment