
‘‘నేను చేసిన ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘మజాకా’. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ పేరు కృష్ణ. నేను, నాన్న (రావు రమేశ్) ఒకే ఇంట్లో ఉండే బ్యాచిలర్స్‌లా బతుకుతుంటాము. మమ్మల్ని ఎవరూ పండగలకు, వేడుకలకు పిలవరు. మా ఇంట్లో మహిళలు పని చేయాలనుకోరు. ఇలా చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి’’ అని సందీప్ కిషన్ అన్నారు. సందీప్ కిషన్(Sandeep Kishan), రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘మజాకా’(Mazaka movie). రావు రమేశ్, అన్షు ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సందీప్ కిషన్ పంచుకున్న విశేషాలు.
⇒ నాకు నచ్చిన కథతో సినిమా చేశాను. నిర్మాతకు డబ్బులొచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అయిపోయారు... ఇలాంటి ఉద్దేశ్యంతోనే నేను సినిమాలు చేసుకుంటూ నా కెరీర్‌లో పరిగెత్తాను. నా తర్వాతి సినిమాల నంబర్స్ (వసూళ్లను ఉద్దేశించి..) ఇంత ఉండాలనే నాలెడ్జ్ నాకు అప్పట్లో లేదు. ఈ నాలెడ్జ్ వచ్చే సమయానికి అంటే... 2019లో నేను క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను. ‘మైఖేల్’ నుంచి మళ్లీ పుంజుకున్నాను. నంబర్స్ గురించి ఆలోచించాను. ‘మైఖేల్’కు పెద్ద నంబర్స్ రాలేదు.
కానీ నాకు మంచి క్రేజ్ వచ్చింది. ప్రేక్షకుల్లో నాకు గుర్తింపు పెరిగింది. ‘భైరవ కోన’ మూవీ పెద్ద నంబర్స్ రాగలవనే నమ్మకాన్ని నాకు ఇచ్చింది. రాయన్ (ఇందులో సందీప్ ఓ లీడ్ రోల్ చేశారు) హిట్‌గా నిలిచింది. కానీ ఇది ధనుష్ అన్న చిత్రం. ఇప్పుడు ‘మజాకా’కు పెద్ద నంబర్స్ వస్తాయి. చెప్పాలంటే... నంబర్స్ గురించి నాకు పెద్ద ఆసక్తి లేదు. కానీ నంబర్స్ వస్తేనే మర్యాద. కళకో, కృషికో దక్కని మర్యాద నంబర్స్‌కు లభిస్తోంది. గత ఐదేళ్లలో నా మార్కెట్ పది రెట్లు పెరిగింది.
⇒ ‘మజాకా’లో ఇప్పటివరకు ఎవరూ చెప్పని మంచి పాయింట్‌ను టచ్ చేశాం. రావు రమేశ్‌గారికి, నాకు మధ్య వచ్చే సీన్స్ బాగుంటాయి. ఆడియన్స్‌కు నచ్చేలా సినిమాలు తీస్తారు త్రినాథరావుగారు. ప్రసన్నగారు మంచి కథ రాశారు. అనిల్, రాజేశ్‌గార్లంటే నాకు హోమ్ ప్రోడక్షన్. ఒకరు నాకు అన్నలాంటివారు. రాజేశ్ మంచి ఫ్రెండ్.
⇒ నా పదిహనేళ్ల కెరీర్లో ముప్పై సినిమాలు చేశాను. నా జర్నీలో కొత్త కథలను, దర్శకులను, ప్రతిభావంతులను ఇండస్ట్రీకి పరిచయం చేశాననే ఆనందం ఉంది. రాబిన్‌హుడ్ లాంటి క్యారెక్టర్‌తో పీరియాడికల్ ఫిల్మ్ చేయాలని ఉంది. అయితే ఖాళీగా అయినా ఉంటాను కానీ, కమర్షియల్ సినిమాల్లో విలన్‌గా చేయను. ఇక తమిళంలో నాకు మంచి ఆదరణ లభిస్తుండటం హ్యాపీ. ప్రస్తుతం సంజయ్ (ప్రముఖ తమిళ హీరో విజయ్ తనయుడు) డైరెక్షన్‌లో మూవీ చేస్తున్నాను. ‘ఫ్యామిలీ మేన్’ థర్డ్ సీజన్‌లో నటించాను. నెట్‌ఫ్లిక్స్‌కి ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment