![Sankranthi Top Three Movies Ticket Rate Hike In Andhra Pradesh](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/5/movies.jpg.webp?itok=jyP8_SCp)
కొత్త ఏడాది ప్రారంభంలోనే మూడు టాప్ సినిమాలు విడుదల కానున్నాయి. రామ్ చరణ్ (గేమ్ ఛేంజర్), బాలకృష్ణ (డాకు మహారాజ్), వెంకటేశ్ (సంక్రాంతికి వస్తున్నాం) వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. అయితే, ఏపీలో ఈ చిత్రాలకు టికెట్ ధరలు పెంచుకునే సౌలభ్యం ప్రభుత్వం కల్పించింది. బెనిఫిట్ షోలతో పాటు అదనపు ఆటలకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది.
గేమ్ ఛేంజర్ టికెట్ ధరలు ఇలా
రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్‌లో నిర్మాత దిల్ రాజ్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 10న తెల్లవారుజామున ఒంటిగంటకు బెనిఫిట్ షో వేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీనికి ఒక్కో టికెట్ ధర రూ.600గా నిర్ణయించింది. అయితే, మొదటి రోజు 4గంటల ఆట నుంచి టికెట్ ధరలు ఇలా ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.175, సింగిల్ థియేటర్స్‌లలో రూ.135 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. ఫస్ట్ డే నాడు ఆరు షోలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. 11వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ రోజుకు 5 షోలు ఉండనున్నాయి. పెంచిన ధరలు 23వ తేదీ వరకు ఉంటాయి.
'డాకు మహారాజ్' టికెట్ ధరలు
నందమూరి బాలకృష్ణ- బాబీ సినిమా 'డాకు మహారాజ్'. ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మించారు. జనవరి 12న విడుదల కానున్న మూవీకి బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. 12వ తేదీ ఉదయం 4 గంటల ప్రత్యేక షో కోసం అనుమతితో పాటు ఒక్కో టికెట్ రూ.500కు విక్రయించేందుకు అనుమతిచ్చింది. రోజుకు ఐదు షోలతో పాటు ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.135, సింగిల్ థియేటర్స్‌లలో రూ.110 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. జనవరి 23 వరకు ఈ ధరలు ఉంటాయి.
సంక్రాంతికి వస్తున్నాం టికెట్ ధరలు
వెంకటేశ్- అనిల్ రావిపూడి హిట్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది. రోజుకు ఐదు షోలు నిర్వహించుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి కల్పించింది. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.125, సింగిల్ థియేటర్స్‌లలో రూ.100 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. జనవరి 28 వరకు ఈ ధరలు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment