
‘‘సారంగపాణి జాతకం’లో నాన్ తెలుగు యాక్టర్లు లేరు. అందరూ తెలుగువారు నటించిన పరిపూర్ణమైన తెలుగు సినిమా ఇది. ఎవరి డబ్బింగ్ వాళ్లే చెప్పుకున్నారు. హీరోయిన్ అయిన తెలుగమ్మాయి రూపా కొడువాయూర్ చక్కగా నటించింది’’ అని డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ చెప్పారు. ప్రియదర్శి, రూపా కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ– ‘‘జెంటిల్‌మన్, సమ్మోహనం’ చిత్రాల తర్వాత కృష్ణప్రసాద్ కాంబినేషన్లో ‘సారంగపాణి జాతకం’ నాకు మూడో సినిమా. ఆయన నన్ను నమ్ముతారు. ఆ నమ్మకం ఇద్దరి మధ్య కొనసాగుతోంది. అన్ని వయసుల వారికి వినోదాన్ని అందించే ఆరోగ్యకరమైన హాస్యభరిత సినిమా ఇది. ఈ సినిమా చూసేటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల కళ్లకు, చెవులకు చేతులు అడ్డు పెట్టాల్సిన అవసరం లేదు’’ అన్నారు.
శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఇది జాతకాల మీద తీసిన సినిమా. నేను భగవంతుణ్ణి, జాతకాలని నమ్ముతాను. ఇలాంటి సినిమా చేసినందుకు గర్వపడుతున్నాను’’ అని చెప్పారు. ‘‘ఇంద్రగంటిగారి దర్శకత్వంలో నటించాలన్న నా కల ‘సారంగపాణి జాతకం’తో నెరవేరింది’’ అన్నారు ప్రియదర్శి. ‘‘ఇంద్రగంటిగారి సినిమాలో నటించడం నాకు ఎప్పుడూ స్పెషల్’’ అన్నారు శ్రీనివాస్ అవసరాల.
‘‘నాకు ఇష్టమైన డైరెక్టర్ ఇంద్రగంటిగారు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాను. ఊహించని విధంగా ఆయన సినిమాలో నటించే చాన్స్ రావడం చాలా సంతోషాన్ని కలిగించింది’’ అని పేర్కొన్నారు రూపా కొడువాయూర్. సినిమాటోగ్రాఫర్ పీజీ విందా, నటీనటులు సమీరా భరద్వాజ్, నివితా మనోజ్, అశోక్‌కుమార్, ప్రదీప్, వడ్లమాని శ్రీనివాస్ మాట్లాడారు.