‘‘నా సినిమా రిలీజైన వెంటనే బ్లాక్‌బస్టర్, సూపర్ హిట్ అని చెబుతుంటారు. సోషల్ మీడియాలో కూడా పాజిటివ్ టాక్ కనిపిస్తుంది. కానీ వీటిని నేను సక్సెస్‌గా భావించను. నా సినిమాలో భాగస్వామ్యులైన అందరూ సంతోషంగా ఉండాలి. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నా సినిమా సక్సెస్ ఇవ్వాలి. అప్పుడు నేను సక్సెస్ అని భావిస్తాను. చెప్పాలంటే.. మన నిజమైన సక్సెస్ మనకు మాత్రమే తెలుస్తుంది’’ అని నాని అన్నారు.
‘అంటే.. సుందరానికీ!’ తర్వాత హీరో నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో నాని చెప్పిన సంగతులు.
» ఓ సినిమా కథ నన్ను ఎగ్జైట్ చేసి, నాకో చాలెంజ్ విసిరి, ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుందని నాకనిపిస్తే ఆ స్క్రిప్ట్‌కు ఓకే చెబుతాను. ప్రతి సినిమాకు కొత్తదనాన్ని ప్రయత్నిస్తూనే ఉంటాను. ఇప్పుడు ఈ ‘సరిపోదా శనివారం’ చేశాను. ఇందులో నేను ఎల్‌ఐసీ ఏజెంట్ సూర్య పాత్రలో కనిపిస్తాను. సినిమాలో యాక్షన్ ఇరవై శాతమే ఉంటుంది. కానీ యాక్షన్ మోడ్‌తో కథ ముందుకెళ్తుంటుంది. ఈ సినిమాలోని దయా పాత్రను ఎస్‌జే సూర్యగారే చేయగలరు. ఈ క్యారెక్టర్‌తో తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గర కావాలని ఆయన ఏడు రోజులు తెలుగులోనే డబ్బింగ్ చెప్పారు.
కానిస్టేబుల్ చారులతగా ప్రియాంక నటన అలరిస్తుంది. అలాగే ఈ సినిమాలో అదితీ బాలన్ నాకు సిస్టర్‌గా నటించారు. మదర్ సెంటిమెంట్ కూడా ఉంది. ఇక సోకులపాలెంతో సూర్య, దయాల కనెక్షన్ ఏంటో సినిమాలో చూడండి.
» ‘అంటే.. సుందరానికీ!’ సినిమా పేరు విన్నన్నసార్లు నా హిట్ సినిమాల పేర్లు కూడా వినలేదు. మనం ఓసారి చరిత్రను గమనిస్తే మంచి సినిమాలన్నీ ఆడాయి.. చెడ్డ సినిమాలన్నీ ఆడలేదు అని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా లేదు. మనం ఓ చెడ్డ సినిమా చేసి సక్సెస్ కాలేకపోయామంటే ఈసారి సక్సెస్ చేసి హిట్ సాధించాలని అనుకుంటాం.
మేం గతంలో మంచి సినిమానే (‘అంటే.. సుందరానికీ!’ని ఉద్దేశించి) చేశాం. మళ్లీ మంచి సినిమా చేశాం. కాకపోతే ‘అంటే.. సుందరానికీ!’ ఓ జానర్ వాళ్లకు మాత్రమే నచ్చింది. ఆ సినిమా నిడివి దాదాపు మూడు గంటలు ఉంది. ‘సరిపోదా శనివారం’ది కూడా దాదాపు మూడు గంటల నిడివి. కానీ ఈ సినిమా కథ, జానర్ వేరు.
» ఓ హీరోకి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడికి మళ్లీ నో చాన్స్ అనే లాజిక్ కరెక్ట్ కాదు. ఒకవేళ ఇలా అనుకుంటే ఇండస్ట్రీలో ఏ దర్శకుడికీ, ఏ హీరోకీ సినిమాలు ఉండకూడదు. మన ఇండస్ట్రీలో ఉన్న గొప్ప గొప్ప హీరోలకు, దర్శకులకు, నిర్మాతలకు ఫ్లాప్స్ ఉన్నాయి.
ఈ లాజిక్ అప్లై అయితే ఇండస్ట్రీలో ఎవరికీ పని ఉండకూడదు... ఒక్క రాజమౌళికి తప్ప. నిజం చెప్పాలంటే వరుస సక్సెస్‌లు వచ్చినప్పుడు కాస్త ఉదాసీనంగా ఉంటారు. అప్పుడప్పుడూ వైఫల్యాలు చూసినవాడే మరింత కష్టపడతాడు. ఈ సినిమాలో వివేక్ మంచి రేసీ స్క్రీన్‌ప్లే రెడీ చేశాడు... సినిమా పరిగెడుతుంటుంది. నా ప్రతి సినిమా నిర్మాత బాగుండాలని కోరుకుంటాను. అందుకే దానయ్యగారు నా గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోపాజిటివ్‌గా మాట్లాడారు.
» కోవిడ్ తర్వాత ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం లేదనే చర్చలు జరుగుతున్నాయి. చెప్పాలంటే... కోవిడ్‌కు ముందు వెయ్యి కోట్ల రూ΄ాయల కలెక్షన్స్ సాధించిన సినిమా ఒకటే ఉంది. కోవిడ్ తర్వాత మూడు సినిమాలు ఉన్నాయి. అయితే గతంలో పది సినిమాలు వస్తే ఐదారు సినిమాలు ఆడియన్స్‌కు ఫర్వాలేదనిపించేవి. కానీ ఇప్పుడు పదిలో ఒకట్రెండు సినిమాలే ఆడియన్స్‌ను అలరిస్తున్నాయి. మంచి కథలతో వస్తే... ఆడియన్స్ థియేటర్స్‌కి వస్తారు.
» లైఫ్‌లో మెమొరబుల్ మూమెంట్స్ అంటే సినిమాల పరంగా చాలానే ఉన్నాయి. అయితే వ్యక్తిగతంగా మాత్రం నా కొడుకు అర్జున్ పుట్టిన క్షణం నా ఫేవరెట్ మెమొరబుల్ మూమెంట్.
Comments
Please login to add a commentAdd a comment