ముంబై: విడాకులు తీసుకున్న మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం ఈ సమాజానికి అలవాటు అని టీవీ నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ షెఫాలి జరీవాలా అన్నారు. పురుషుడు పది పెళ్లిళ్లు చేసుకున్నా కూడా ఎవరూ నోరు మెదపరని, అదే స్త్రీ రెండో పెళ్లి చేసుకుంటే మాత్రం ఆమె క్యారెక్టర్‌ను శంకిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కాంటా లగా’ వీడియోతో పాపులర్ అయిన షెఫాలి జరీవాలా 2004లో మ్యుజీషియన్ హర్మీత్ సింగ్‌ను వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో 2014లో విడాకులు తీసుకున్నారు. అనంతరం షెఫాలి, నటుడు ప్రయాగ్ త్యాగిని రెండో వివాహం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి తాజాగా వెల్లడించారు. ‘‘చిన్న చిన్న విషయాలకు కూడా మహిళలను నిందించడం చాలా మందికి అలవాటు. ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే.. మనం సంతోషంగా ఉన్న ఒక్క ఫొటోను షేర్ చేసినా కూడా వారు సహించరు. ప్రతీ విషయాన్ని జడ్జ్ చేయాలనే చూస్తారు. ఇదంతా ఎదుటి వాళ్లకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా? అసలు మహిళలనే ఎందుకు అలా జడ్జ్ చేస్తారు. ముఖ్యంగా విడాకులు తీసుకున్న స్త్రీల గురించి చులకనగా మాట్లాడతారు.
నేను.. నా మొదటి భర్తతో విడిపోయిన తర్వాత.. ‘‘ఆమే ఏదో తప్పు చేసి ఉంటుంది. తను కాంటా లగా గర్ల్ కదా. చాలా బోల్డ్. అందుకేనేమో విడాకులు’’అంటూ నీచంగా మాట్లాడారు. సినిమాల్లో వేశ్య, ప్రతినాయక, బోల్డ్ పాత్రలు పోషిస్తే నిజ జీవితంలో కూడా అలాగే ఉంటామని అనుకోవడం పొరబాటు’’ అని ఉద్వేగానికి లోనయ్యారు. కాగా కాంటా లగా పాట(2002)తో బోల్డ్ నటిగా గుర్తింపు పొందిన షెఫాలీ.. నచ్ బలియే 2, బిగ్‌బాస్ 13 వంటి పలు రియాలిటీ షోలతో పాటు, పలు వెబ్‌సిరీస్‌లలోనూ నటించారు.
Comments
Please login to add a commentAdd a comment