
ముంబై: సినీ నటి శిల్పా శెట్టికి ఆభరణాలంటే చాలా ఇష్టం. తన దగ్గర ఉన్న అద్భుతమైన జువెల్లరీ కలెక్షన్, వివిధ సందర్భాల్లో ఆమె ధరించే నగలు ఈ విషయాన్ని ఎన్నోసార్లు రుజువు చేశాయి. ఈ క్రమంలో పొడుగు కాళ్ల సుందరి తన వద్దనున్న 20 క్యారట్ల డైమండ్ గురించి ఓ ఆసక్తికర విషయం పంచుకుంది. తాను ఎంతో విలువైనదిగా భావించే ఈ వజ్రాన్ని, తన కొడుకు వియాన్ రాజ్ కుంద్రాకు కాబోయే భార్యకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. అయితే ఇందుకు తాను ఓ షరతు కూడా పెట్టినట్లు శిల్పా వెల్లడించింది. కాబోయే కోడలు తనతో సఖ్యతగా మెలిగితేనే, ఆ వజ్రం పొందేందుకు అర్హురాలని, లేదంటే చిన్న చిన్నఆభరణాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని, వియాన్‌తో చెబుతూ ఉంటానని సరదాగా వ్యాఖ్యానించింది. ‘‘మీరు నా ఇన్‌స్టాగ్రామ్‌ని చూస్తే నేను అమ్మతనానికి ఎంత ప్రాధాన్యం ఇస్తానో తెలుస్తుంది. ఆభరణాలు వారసత్వాన్ని కొనసాగిస్తాయని భావిస్తాను. అందుకే నేను ఎక్కువగా వాటిని కొనుగోలు చేస్తా’’ అని చెప్పుకొచ్చింది.
ఇక శిల్పాశెట్టి 2009లో రాజ్ కుంద్రాను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి కుమారుడు వియాన్, కుమార్తె సమీషా(సరోగసీ ద్వారా కలిగిన సంతానం) ఉన్నారు. కాగా రాజ్ కుంద్రా తనకు ప్రేమను వ్యక్తం చేసిన నాటి మధురానుభూతులను వీడియో రూపంలో పంచుకున్న శిల్ప.. ‘‘పదకొండేళ్ల క్రితం మీరు నాకు ఏ విధంగా ప్రపోజ్ చేశారనేది ఇప్పటికీ నాకు గుర్తుంది. పారిస్‌లోని లే గ్రాండ్ హోటల్ ఒక హాల్ మొత్తాన్ని మీరు బుక్ చేశారు. స్నేహితులుగా మన మొదటి విందు అని మీరు నాతో చెప్పారు. ఆ తర్వాత నేను హాల్‌లోకి ప్రవేశించగానే, సంగీత కళాకారులతో మ్యూజిక్ ప్లే చేయిస్తూ, మోకాలిపై కూర్చొని డైమండ్ రింగ్‌తో ప్రపోజ్ చేశారు. అది నేనెప్పటికీ మర్చిపోలేను. ప్రతి ఒక్క అమ్మాయి ఇలాంటి కలే కంటుంది. ఆనాటి నుంచి నేటిదాకా మీరు నా కలలన్నింటినీ నిజం చేస్తూనే ఉన్నారు’’ అని భర్తపై ప్రేమను చాటుకుంది.(చదవండి: భర్త క్షేమం కోరి...)
అయితే అది కేవలం ఐదు క్యారెట్ల డైమండ్ రింగ్ కాబట్టి.. ‘యెస్’ చెప్పడానికి తాను కాస్త సమయం తీసుకున్నానని భావించిన రాజ్ కుంద్రా, పెళ్లికి మరింత పెద్ద రింగ్ ఇస్తానని తనకు చెప్పాడంటూ చిరునవ్వులు చిందించింది. ప్రపోజ్ చేసిన విధానం కొంత మెటీరియలిస్టిక్‌గా అనిపించినా, ఆ విషయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా అద్భుతంగా మలచాడని చెప్పుకొచ్చారు. ‘‘నాకు పారిస్ లోని ఈఫిల్ టవర్ అంటే చాలా ఇష్టం. అది ఆయనకు బాగా తెలుసు. నేనక్కడ షాట్ కూడా తీశాను. నాకు జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన మా ఆయనతోనే అక్కడికి వెళ్లాలని ఉంటుంది’ అంటూ వీడియోను ముగించింది.
Comments
Please login to add a commentAdd a comment