'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో జూ ఎన్టీఆర్ అభిమానులు చాలా నిరుత్సాహం చెందారు. దీనంతటికి కారణం ఈవెంట్‌ను నిర్వహించిన శ్రేయాస్ సంస్థ అంటూ నిర్వాహకులపై ఫ్యాన్స్ మండిపడ్డారు. దీంతో తాజాగా తారక్ అభిమానులకు క్షమాపణలు చెబుతూ అధికారికంగా ఆ ఆర్గనైజేషన్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.
'దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చోటు చేసుకున్న దురదృష్టకర పరిస్థితి వల్ల మేము చింతిస్తున్నాం. ఎన్టీఆర్ పట్ల మీ అందరికీ ఉన్న అపారమైన అభిమానం, ప్రేమను మేము అర్థం చేసుకున్నాం. ఈవెంట్ రద్దు కావడంతో మీలో చాలామంది ఎంత నిరుత్సాహానికి లోనయ్యారు. దానిని తెలుసుకుని బరువెక్కిన హృదయంతో ఈ నోట్‌ని విడుదల చేస్తున్నాం. దయచేసి అక్కడి పరిస్థితిని అర్థం చేసుకుని , మీకు జరిగిన అసౌకర్యానికి మా నుంచి క్షమాపణలు కోరుతున్నాం.
వాస్తవంగా తారక్ అభిమానులను దృష్టిలోపెట్టుకొని ఈ కార్యక్రమాన్ని బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించాలని అనుకున్నాం. అందుకు తగ్గట్లు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను సంప్రదించాం. అనుమతి కోసం చాలా ప్రయత్నంచాం. కానీ, వినాయక చవితి వేడుకలు, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో నోవాటెల్‌ను ఎంపిక చేయాల్సి వచ్చింది.
వాస్తవంగా మేము 5500 మంది వ్యక్తులకు సరిపడేలా నోవాటెల్‌లో హాల్ 3 నుంచి హాల్ 6 వరకు బుక్ చేశాం. 4వేల మందికి మాత్రమే ఎంట్రీ ఉండేలా పోలీసుల నుంచి అనుమతి పొందాం. ఆమేరకు మాత్రమే పాస్‌లను ముద్రించాం. అంతకు మించి అదనపు పాస్‌లు మేము ఇవ్వలేదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, 30వేలకు పైగానే అభిమానులు వచ్చారు. మేం అంచనా వేసినదానికంటే పెద్ద ఎత్తున రావడంతో గందరగోళం నెలకొంది. దీంతో అక్కడి గేట్లన్నీ కిక్కిరిసిపోయాయి. కొందరు తప్పని పరిస్థితిలో బారికేడ్లు పగలగొట్టడంతో పరిస్థితి అదుపుతప్పింది.
ఆ సమయంలో పరిస్థితి కంట్రోల్ తప్పింది. దీంతో ఈవెంట్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. గతంలో మా ఆర్గనైజేషన్ ద్వారా సుమారు 2 లక్షల మందికి పైగా ప్రజలతో కూడా భారీ ఈవెంట్లను విజయవంతంగా చేశాం. ఈ క్రమంలోనే దేవర ఈవెంట్‌ను కూడా మరింత సక్సెస్ చేయాలని 100కు పైగా యూట్యాబ్ చానల్స్‌లో లైవ్ కూడా ఏర్పాటుచేశాం.
ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సినిమా సింగిల్‌గా వస్తుండటంతో అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. తారక్ మీద ప్రేమతో చాలా దూరప్రాంతాల నుంచి వచ్చారు. అయితే, మీ అందరినీ చాలా నిరుత్సా నిరుత్సాహపరిచినందుకు క్షమాపణలు కోరుతున్నాం. ఎన్టీఆర్‌పై మీ ప్రేమ చాలా గొప్పది. అందుకే ఆయన కోసం ఇంతలా తరలి వచ్చారు. తారక్‌పై మీ ప్రేమ, బలం ఎంతటిదో నిన్న రాత్రి ప్రపంచానికి చాటి చెప్పారు. కానీ, మికు అసౌకర్యం కల్పించినందుకు చింతిస్తున్నాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మాకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. ఎప్పటికీ మీ సపోర్ట్ మాపై ఉంటుందని ఆశిస్తున్నాం.' అని శ్రేయాస్ మీడియా లేఖ విడుదల చేసింది.
దేవర ఈవెంట్ రద్దు అయిన తర్వాత జూ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ఒక వీడియో ద్వారా అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27న దేవర విడుదల కానుంది. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment