చాలా గ్యాప్ తర్వాత హీరోయిన్ శ్రియ సరన్ గమనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాతో సంజనా రావు దర్శకురాలిగా పరిచయం కాబోతోన్నారు. శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించారు. క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గమనం సినిమాను డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రియా సరన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఇలా ఉన్నాయి.
‘కరోనా సమయంలో ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంతో మంది పనులు లేకుండా అవస్థలు పడ్డారు. ఇప్పుడు సినిమా పరిశ్రమ కోలుకుంటోంది. నేను ఎంత వరకు బతికి ఉంటానో.. అప్పటి వరకు నటిస్తూనే ఉండాలని, సినిమాలు చేస్తూనే ఉండాలని అనుకుంటాను. సినిమాల పట్ల ఇప్పుడు నా దృక్పథం మారింది. నా కూతురు, నా ఫ్యామిలీ నా సినిమాలు చూసి గర్వపడేలా ఉండాలని అనుకుంటున్నాను. ఏ పాత్ర చేసినా కూడా నా మనసుకు నచ్చాలని అనుకుంటున్నాను. ఈ కథ విన్న వెంటనే నా కంట్లో నీళ్లు తిరిగాయి’ అని చెప్పారు.
ఇక ‘ఇందులో నేను దివ్యాంగురాలి పాత్రలో కనిపిస్తాను. వినిపించదు కానీ మాట్లాడతాను. ఈ కారెక్టర్ కోసం కొన్ని క్లాసులకు కూడా వెళ్లాను. నిస్సహాయతతో ఉన్న మహిళ సాగించే ప్రయాణమే నా పాత్ర. ఊహకందని ఓ అతీంద్రియ శక్తి ఉందని నమ్మే పాత్రలో కనిపిస్తాను. ఇక నుంచి నేను చాలెంజింగ్ పాత్రలే చేయాలని అనుకుంటున్నాను. నా కూతురు నా సినిమాలు చూసి ఇలాంటివి ఎందుకు చేశావ్ అని అనకూడదు. నా పని పట్ల నేను ఎప్పుడూ గర్వంగానే ఫీలవుతాను. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నా ఫ్రెండ్ చనిపోయారు. అప్పుడు నా హృదయం బద్దలైపోయింది. అయినా ఆ బాధలోనే షూటింగ్ చేశాను. నేను ఇందులో ఒక రూంలోనే ఉంటాను. దాన్నుంచి బయటకు రావడమే నా విజయం. ఈ పాత్రను పోషించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది’ అన్నారు
‘ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేను. ఇది సరైన సమయం కాదు. రాజమౌళి సర్‌తో చాలా ఏళ్ల తరువాత పని చేశారు. ఆర్ఆర్ఆర్ పెద్ద సినిమా. రాజమౌళి సర్ చెప్పినప్పుడు మేం మాట్లాడతాం. ప్రతీ సినిమాతో ఏదో ఒకలా కనెక్ట్ అవుతాం. బట్టలు కుట్టడం నాకు రాదు. కానీ కమల పాత్ర కోసం నేర్చుకున్నాను. మా అమ్మ ఎక్కువగా బట్టలు కుడుతుంది. ఈ పాత్రకు నాకు అస్సలు పోలీక ఉండదు. కానీ ఎమోషన్స్ పరంగా చాలా కనెక్షన్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ తరువాత చాలా మార్పులు వచ్చాయి. కానీ వర్కవుట్లు చేసి, కథక్ డ్యాన్స్ చేస్తూ ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టాను. పైగా మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి యోగా నేర్పించారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యం, ఫిట్ నెస్ అంతా బాగుంటుంది. పిల్లలు పుట్టాక ప్రపంచం మారుతుంది. మనకు బాధ్యతలు పెరుగుతాయి. మనిషిలో మార్పులు వస్తాయి. ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్లినా మా పాపను తీసుకుని వెళ్తున్నాం’ అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment