
చెన్నై: ప్రముఖ సినీగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా మహమ్మారితో పోరాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు కరోనా సోకడానికి గాయని మాళవికనే కారణమంటూ సోషల్‌మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన గాయని మాళవిక.. బాలసుబ్రహ్మణ్యానికి కరోనా సోకడానికి కారణం తానే అని ప్రచారం చేస్తున్నారని వాపోయారు. దీనిపై ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జూలై నెలాఖరులో ఎస్పీ బాలు హైదరాబాదులో ఓ కార్యక్రమానికి హాజరయ్యారని, ఆ కార్యక్రమానికి మాళవిక కూడా వచ్చిందని, అప్పటికే మాళవికకు కరోనా పాజిటివ్ అని తేలినా నిర్లక్ష్యంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నదంటూ ప్రచారం జరుగుతోంది.
దీనిపై మాళవిక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా సోకడానికి తాను ఎంతమాత్రం కారణం కాదని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయం గురించి మాళవిక స్పందిస్తూ ‘ఎస్పీబాలసుబ్రహ్మణ్యంకి సంబంధించిన ఒక పాటల కార్యక్రమం సామజవరగమన అనే కార్యక్రమానికి హాజరయిన నేను వేరే సింగర్స్‌తో కలిసి షూట్‌లో పాల్గొన్నాను కానీ ఎస్పీ బాలును కలవలేదు. ఆయనకు ఆగస్టు 5 వ తేదీన కరోనా పాజిటివ్ వస్తే నాకు ఆగస్టు 8వ తేదీన కరోనా పాజిటివ్ అని వచ్చింది. కానీ కొంత మంది నాకు జూలైలోనే కరోనా వస్తే కావాలనే ఆ కార్యక్రమానికి హాజరయ్యానని ప్రచారం చేస్తున్నారు’ అని తన బాధను ఫేస్‌బుక్ ద్వారా తెలియజేశారు.
చదవండి: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలంటూ రజనీ ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment