బెంగళూరులో థియేటర్ వద్ద జేమ్స్ హీరో పునీత్ రాజ్‌కుమార్ కటౌట్లు
సాక్షి, బెంగళూరు: కన్నడనాట యువ నటుడు, పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం జేమ్స్.. ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్లతో సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నెల 17వ తేదీన జేమ్స్ విడుదలైంది. ‘ది క శ్మీర్ ఫైల్స్ తో పాటు మరో భారీ సినిమా కోసం బెంగళూరుతో సహా రాష్ట్రంలో పలు థియేటర్ల నుంచి జేమ్స్ సినిమాను తీసేస్తున్నారని రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పరభాష చిత్రాల కోసం కన్నడ చిత్రాలకు అన్యాయం చేయొద్దని పలు కన్నడపర సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.
సీఎల్పీ నేత– జేమ్స్ నిర్మాత భేటీ..
జేమ్స్ సినిమా నిర్మాత కిశోర్, సీఎల్పీ నేత సిద్ధరామయ్య కలిసి తాజా పరిణామాలపై చర్చించారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఒక సినిమాను బలవంతంగా నిలిపేసి మరో సినిమాను చూడాలని ఒత్తిడి చేయడం సరికాదని సిద్ధరామయ్య అన్నారు. ఇక మరో భారీ సినిమా కోసం జేమ్స్ సినిమాను బలి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్ధాంతరంగా జేమ్స్‌ను తొలగించడం బాధాకరమని ఆ సినిమా దర్శకుడు, నిర్మాత వీడియో ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేశారు.
జేమ్స్‌ను తొలగించరాదు: విశ్వనాథ్
మైసూరు: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన జేమ్స్ సినిమాను ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం కోసం ఎత్తివేయడం తగదని బీజేపీ ఎమ్మెల్సీ హెచ్.విశ్వనాథ్ అన్నారు. బుధవారం ఆయన మైసూరులో మాట్లాడుతూ కన్నడ సంప్రదాయాలకు నిదర్శనం డాక్టర్ రాజ్‌కుమార్ అన్నారు. అలాంటి వ్యక్తి కుమారుడు పునీత్ అకాల మరణం తరువాత విడుదల అయిన జేమ్స్ చిత్రాన్ని పక్కన పెట్టడం సరికాదన్నారు. రాష్ట్రంలో కన్నడ చిత్రాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
కాంగ్రెస్ ర్యాలీ..
జేమ్స్‌కు మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు మైసూరులో ర్యాలీ చేశారు. రామస్వామి సర్కిల్ నుంచి పునీత్ రాజ్‌కుమార్ చిత్రపటంతో ఊరేగింపుగా వెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా జేమ్స్ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తోందని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఎంకే సోమశేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment