బాలన్నా...పాట పాడవా: అర్జున్‌ | SP Balasubrahmanyam Laid To Rest With State Honours | Sakshi
Sakshi News home page

భారతరత్న ఇవ్వాలి: భారతీ రాజా

Published Sun, Sep 27 2020 6:49 AM | Last Updated on Sun, Sep 27 2020 12:47 PM

SP Balasubrahmanyam Laid To Rest With State Honours - Sakshi

అంత్యక్రియలకు హాజరైన నటుడు విజయ్‌, అర్జున్, భారతీరాజా

గాన దిగ్గజం ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహానికి అభిమానలోకం, ఆప్తులు, ప్రముఖుల కన్నీటి సంద్రం నడుమ శనివారం అంత్యక్రియలు జరిగాయి. తిరువళ్లూరు సమీపంలోని తామరపాక్కంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో గానగంధర్వుడిని ఖననం చేశారు. తమ అభిమాన గాయకుడి కడచూపు కోసం అభిమానలోకం, ప్రముఖులు తరలిరావడంతో ఉద్వేగ భరిత వాతావరణంలో పరిసరాలు మునిగాయి. 

సాక్షి, తిరువళ్లూరు: చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఎస్పీబి శుక్రవారం అందర్నీ వీడి అనంతలోకాలకు పయనమయ్యారు. ఈ సమాచారం యావత్‌ సంగీత ప్రపంచాన్ని, అభిమానలోకాన్ని కన్నీటి సాగరంలో ముంచింది. ఆస్పత్రి నుంచి చెన్నై నుంగంబాక్కంలోని నివాసంలో ఆయన పారి్థవదేహాన్ని ఉంచారు. అనంతరం అక్కడి నుంచి రాత్రి 8.45 గంటలకు తిరువళ్లూరు జిల్లా తామరపాక్కం వద్ద వున్న ఎస్‌పీబీ గార్డెన్‌కు  పార్థివదేహాన్ని అంత్యక్రియల కోసం తరలించారు.  శనివారం ఉదయం 7 గంటల నుంచి 10.30 గంటల వరకు అభిమానులు, ఆప్తులు, ప్రముఖుల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచారు. గాన గంధర్వుడి కడచూపుకోసం అభిమానులు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆ పరిసరాలు శోక సంద్రంలో మునిగాయి.  

ఎస్పీబీ అంతిమయాత్ర
తరలివచ్చిన ప్రముఖులు.. 
ఎస్పీబీని కడసారి చూసుకునేందుకు భారీగా అభిమానులు ప్రముఖులు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతినిధిగా నీటిపారుదల శాఖా మంత్రి అనిల్‌ కుమార్‌యాదవ్, తమిళనాడు ప్రభుత్వం తరఫున తమిళాభివృద్ధి, పురావస్తుశాఖా మంత్రి పాండ్యరాజన్, కలెక్టర్‌ మహేశ్వరి రవికుమార్, డీఐజీ చాముండేశ్వరీ,  పూందమల్లి ఎమ్మెల్యే కృష్ణస్వామి, పీబీకే రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌మూర్తి, జెడ్పీ మాజీ చైర్మన్‌ రవిచంద్రన్‌తో పాటు పలువురు నేతలు తరలివచ్చి నివాళులర్పించారు. (గాయక నాయకా స్వరాభివందనం)

అలాగే, ప్రముఖ నటుడు విజయ్, అర్జున్, దర్శకుడు  భారతీరాజా, అమీర్, రçహ్మాన్, సింగర్‌ మనో, మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీప్రసాద్, హాస్యనటుడు మైల్‌స్వామి బుల్లితెర నటుడు కృష్ణన్, బోండామురుగన్, భారతీ, శ్రీరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ఎస్పీబీతో 9వ తరగతి వరకు చదువుకున్న నగరి జెడ్పీ పాఠశాలకు చెందిన 50 మంది పూర్వపు విద్యార్థులు తరలి వచ్చి చిన్ననాటి మిత్రుడిని కడసారి చూసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే, విజయ్‌ హఠాత్తుగా అక్కడ రావడంతో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఎస్పీబి భౌతికకాయానికి నివాళులర్పించిన విజయ్, ఆయన కుమారుడు చరణ్‌తో మట్లాడి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు.  

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు.. 
ప్రముఖులు అభిమానుల సందర్శనను 10.45 గంటలకు నిలిపి వేశారు. తర్వాత సమీప బంధువులు, కుటుంబీకుల్ని అనుమతించారు. ఎస్పీబీ తనయుడు చరణ్‌ సంప్రదాయబద్ధంగా ప్రక్రియల్ని ముగించారు. గంటపాటు ఈ కార్యక్రమం సాగింది. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో పారి్థవదేహనికి అంత్యక్రియల ఏర్పాట్లు జరిగాయి.  ఎస్పీ అరవిందన్‌ నేతృత్వంలో సాయుధదళ పోలీసులు ఎస్పీబీ భౌతికకాయాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈసమయంలో జోహార్‌ ఎస్పీబీ నినాదం మార్మోగింది.

ఆయన పాటలను పాడుతూ ఊరేగింపు సాగింది.  చివరకు పోలీసులు మూడు రౌండ్‌లతో 72 తూటాలను గాల్లో పేల్చి అంత్యక్రియల ప్రక్రియను ముగించారు. ఆయన పారి్థవదేహాన్ని అశ్రునయనాల నడుమ ఖననం చేశారు. కాగా, ఎస్పీబీ ఇంట్లో ఉన్న శివలింగంకు నిత్యం పూజలు చేసే వేద పండితుడు సుసర్ల సుబ్రమణ్య శాస్త్రి నేతృత్వంలోని ఐదుగురు పండితుల బృందం అంత్యక్రియల లాంఛనాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.  

ప్రముఖుల ఉద్వేగం.. 
బాలన్నా...పాట పాడవా:కడ చూపుకోసం వచ్చిన సినీ నటుడు అర్జున్‌ ఎస్పీబీ పార్థివదేహాన్ని చూసి బోరున విలపించారు. బాలన్న.. తన చిత్రాల్లో ఎన్నో దేశభక్తి పాటలను పాడి విజయా న్ని అందించావని, ఇప్పుడు లేచి ఓ పాట పాడవా అంటూ అర్జున్‌ ఉద్వేగానికి లోనయ్యారు. 
భారతరత్న ఇవ్వాలి:  ఎస్పీబీకి సినీ ప్రపంచానికి అందించిన సేవలను గుర్తు చేస్తూ, ఆయన చరిత్రను చాటే రీతిలో కేంద్రం భారతరత్నతో గౌరవించాలని దర్శకుడు భారతీ రాజా విజ్ఞప్తి చేశారు. ఎస్పీబీకి నివాళులర్పించే క్రమంలో భారతీ రాజా, గాయకుడు మనో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.  
ఆడుకుందాం...లేచి రండి సార్‌: మిమ్మల్ని కలిసినప్పుడల్లా కాసేపు సరదాగా ఆడుకుందామా అని అడిగే తమరు దేవుడు ఆడిన ఆటలో అలసి శాశ్వత విశ్రాంతిలో ఉన్నారని, ఇప్పుడు లేచి రండి సార్‌..కాసేపు ఆడుకుందాం అని హాస్య నటుడు మైల్‌స్వామి విలపించారు.  
ఎంతో కష్టపడ్డారు: జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని విజయాల్ని ఎస్పీబీ సొంతం చేసుకున్నారని నటి శ్రీరెడ్డి అన్నారు. సాధారణంగా తాను ఇలాంటి కార్యక్రమాలకు హాజరు కానని, అయితే, ఎస్పీబీ ప్రత్యేకమైన లెజెండ్‌ అని, ఆయనపై ఉన్న అభిమానం, గౌరవం ఇక్కడకు తనను రప్పించిందని శ్రీరెడ్డి నివాళులర్పించారు.  
క్లాస్‌ టూ మాస్‌: క్లాస్‌ పాటల నుంచి మాస్‌ పాటల వరకు అన్నింటికి న్యాయం చేసిన ఘనత ఎస్పీబీది అని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ పేర్కొన్నారు. తాను సమకూర్చిన మొదటి సంగీతానికి పాటపాడాలని అభిమానిగా కోరితే, ఆ కోరికను మన్నించిన మహావ్యక్తి  ఇకలేరన్నది నమ్మలేకున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement