సీన్‌ కట్‌ చేస్తే వచ్చే ఏడాదే! | Stars who did not appear on the silver screen this year | Sakshi
Sakshi News home page

సీన్‌ కట్‌ చేస్తే వచ్చే ఏడాదే!

Published Fri, Mar 10 2023 1:28 AM | Last Updated on Fri, Mar 10 2023 6:53 AM

Stars who did not appear on the silver screen this year - Sakshi

స్టార్స్‌ ఎప్పటికప్పుడు తమ ఫ్యాన్స్‌ను అలరించాలనే అనుకుంటారు. ఏడాదికో సినిమా.. వీలైతే రెండు సినిమాల్లోనైనా కనిపించాలనుకుంటారు. అయితే కొన్నిసార్లు ప్లాన్‌ తారుమారు అవుతుంది. ఓ ఏడాది వరకు వారు థియేటర్స్‌లో కనిపించకపోవచ్చు. ఇలా కొంతమంది స్టార్స్‌ ‘సీన్‌ కట్‌ చేస్తే.. వచ్చే ఏడాదే!’ అంటున్నారు. ఈ ఏడాది సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించని ఆ స్టార్స్‌ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.  

పండగకి ప్రకటన 
గత ఏడాది సంక్రాంతికి ‘బంగార్రాజు’ (ఈ చిత్రంలో మరో హీరోగా నాగచైతన్య నటించారు)గా, దసరాకు ‘ది ఘోస్ట్‌’గా థియేటర్స్‌కి వచ్చారు నాగార్జున. ఆ తర్వాత ఆయన హీరోగా నటించనున్న సినిమా గురించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. దర్శకుడు మోహన్‌రాజా, రచయిత బెజవాడ ప్రసన్నకుమార్‌ నాగార్జునకు కథలు వినిపించారు.

ముందుగా బెజవాడ ప్రసన్నకుమార్‌ కథకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట నాగార్జున. ఉగాదికి ఈ చిత్రాన్ని ప్రకటించి, టైటిల్, ఫస్ట్‌ లుక్‌ను కూడా రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో నాగార్జున అండ్‌ టీమ్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రివెంజ్‌ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో ‘అల్లరి’ నరేశ్‌ కీ రోల్‌ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్‌ చేయాలను కుంటున్నారట. ఇదే నిజమైతే నాగార్జున ఈ ఏడాది తెరపై కనిపించకపోవడం అక్కినేని ఫ్యాన్స్‌ను నిరుత్సాహపరిచే విషయం. అయితే అక్కినేని వారసులు నాగచైతన్య చేస్తున్న ‘కస్టడీ’, అఖిల్‌ ‘ఏజెంట్‌’ ఈ ఏడాదే విడుదలవుతాయి. సో... ఆ విధంగా బ్యాలెన్స్‌ అయిపోతుంది. 

వచ్చే వేసవిలోనే.. 
‘జనతా గ్యారేజ్‌’ (2016) చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ఈ సినిమా షూటింగ్‌ పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న రిలీజ్‌ చేయనున్నట్లు ఎన్టీఆర్, కొరటాల అండ్‌ కో ఆల్రెడీ ప్రకటించారు.

ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు..’ పాట ఆస్కార్‌ ప్రమోషన్స్‌ కోసం అమెరికాలో ఉన్నారు ఎన్టీఆర్‌. ఆస్కార్‌ వేడుక (ఈ నెల 12) పూర్తి కాగానే ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అవుతారు. హైదరాబాద్‌ శివార్లలో ఆల్రెడీ ఈ సినిమా కోసం ఓ పోర్టు సెట్‌ వేస్తున్నారు. కళ్యాణ్‌ రామ్, మిక్కిలినేని సుధాకర్,  కె. హరికృష్ణ నిర్మించనున్న ఈ సినిమాతో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. 

సంక్రాంతి బరిలో...
వచ్చే సంక్రాంతికి థియేటర్స్‌లోకి రానున్నారట రామ్‌చరణ్‌. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను ముందు ఈ ఏడాదిలోనే రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ అటు ‘ఇండియన్‌ 2’కి, ఇటు చరణ్‌ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు శంకర్‌. మరోవైపు రామ్‌చరణ్‌ కూడా ‘నాటు నాటు..’ పాట ఆస్కార్‌ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంటున్నారు.

ఈ కారణాల వల్ల రామ్‌చరణ్‌–శంకర్‌ల సినిమా రిలీజ్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ చేసే ప్లాన్‌ ఉన్నట్లు నిర్మాత ‘దిల్‌’ రాజు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సో... రామ్‌చరణ్‌ ఈ ఏడాది థియేటర్స్‌లో కనిపించకపోవడం ఆల్మోస్ట్‌ కన్ఫార్మ్‌ అయినట్లే. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

ఆలస్యంగా పుష్పరాజ్‌ 
ఈ ఏడాదే రావాల్సిన పుష్పరాజ్‌ (‘పుష్ప’లో అల్లు అర్జున్‌ పాత్ర పేరు) వచ్చే ఏడాది థియేటర్స్‌కు వస్తాడు. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ తొలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’ 2021 డిసెంబరు 17న విడుదలై సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. దీంతో మలి భాగం ‘పుష్ప: ది రూల్‌’పై మరింత ఫోకస్‌ పెట్టింది టీమ్‌. ఈ సినిమాను ముందు ఈ ఏడాది డిసెంబరులో విడుదల చేయాలనుకున్నారు. కానీ స్క్రిప్ట్‌ అండ్‌ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ను లాక్‌ చేయడానికి కాస్త టైమ్‌ పట్టింది.

ఇలా పుష్పరాజ్‌ ఈ ఏడాది థియేటర్స్‌లో కనిపిం చడు. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, ఫాహద్‌ ఫాజిల్, సునీల్, అనసూయ కీ రోల్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది.  మరికొందరు స్టార్స్‌ కూడా ఈ ఏడాది సిల్వర్‌ స్క్రీన్‌పై మిస్సయ్యే చాన్స్‌ ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement