ఆ సినిమా చూసి దర్శకుడు స్మోకింగ్‌ మానేశాడు: సూర్య | Surya talks about Et movie | Sakshi
Sakshi News home page

Suriya: జై భీమ్‌ చేయొద్దని చాలామంది సలహా ఇచ్చారు

Published Sun, Mar 6 2022 5:47 AM | Last Updated on Sun, Mar 6 2022 8:28 AM

Surya talks about Et movie - Sakshi

‘‘కరోనా తర్వాత సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. మనుషుల జీవితాల్లోనూ మార్పులొచ్చాయి. జీవితంలో ఏయే అంశాలకు ప్రాముఖ్యత ఇవ్వాలనే విషయాలపై చాలామందికి ఓ క్లారిటీ వచ్చినట్లుంది. ఇంతకుముందు ఫ్యామిలీ పట్ల నిర్లక్ష్యంగా ఉన్నవాళ్లు ఇప్పుడు బాధ్యతగా ఉంటున్నారు. నా బంధువులు, స్నేహితుల్లో చాలామంది ఇప్పుడు ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడుపుతున్నారు’’ అని సూర్య అన్నారు. పాండిరాజ్‌ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన ‘ఈటీ’ (ఎవరికీ తలవంచడు) ఈ నెల 10న విడుదల కానుంది. సునీల్‌ నారంగ్, డి. సురేష్‌బాబు, ‘దిల్‌’ రాజు ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో సూర్య చెప్పిన విశేషాలు.

► ఒక పుస్తకం పూర్తిగా చదవాలంటే రెండుగంటల కంటే ఎక్కువ సమయమే పడుతుంది. అయితే రెండు గంటల సమయంలోనే సినిమా ద్వారా ఎమోషన్స్‌ని షేర్‌ చేసుకోవచ్చు. అందుకే సినిమా అనేది స్ట్రాంగ్‌ మీడియమ్‌ అని నా నమ్మకం. అలాగే సినిమాలు మన జీవితాలను ప్రభావితం చేయగలవని నమ్ముతున్నాను. ‘వారనమ్‌ ఆయిరం’ (తెలుగులో ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’) సినిమా చూసి స్మోకింగ్‌ మానేసినట్లుగా దర్శకుడు వెట్రిమారన్‌ ఓ సందర్భంలో చెప్పారు. హిందీ సినిమా ‘గెహరాయియా’  క్లైమాక్స్‌లో వచ్చే ఓ డైలాగ్‌ నా ఆలోచనల్లో, నా వ్యక్తిగత జీవితంలో మార్పు తీసుకువచ్చింది. అలా ‘ఈటీ: ఎవరికీ తలవంచడు’ చిత్రంలోని అంశాలు కొందరిలో మార్పు తేవడంతో పాటు ప్రతి ఇంట్లోనూ చర్చించుకునే సినిమా అవుతుందని నమ్ముతున్నాను.

► ప్రతి నగరంలో జరిగే ఘటనలే ఈ సినిమాలో చూపించాం. మన ఇంట్లోని మహిళల పట్ల మన ప్రవర్తన, వ్యవహారశైలి ఎలా ఉండాలి? అనే విషయాలను చెప్పే ప్రయత్నం చేశాం. మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారికి మంచి నీళ్లు ఇవ్వాల్సిందిగా అమ్మాయిలకే చెబుతాం. అబ్బాయిలకు ఎందుకు చెప్పకూడదు? ఈ బ్యాలెన్స్‌ ఎక్కడ మిస్‌ అవుతోంది? భార్యాభర్తలు గొడవ పడితే.. భార్యను కాస్త తగ్గమని ఆమె పుట్టింటివారు కూడా చెబుతుంటారు. ఎందుకలా? ఇలాంటి అంశాలను ప్రస్తావించాం.

► ‘నేను హీరో’ అనే కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకు వచ్చినప్పుడే ‘సూరరై పోట్రు’, ‘జై భీమ్‌’ వంటి సినిమాలను చేయగలను. ‘‘ట్రైబల్‌ బ్యాక్‌డ్రాప్, పెద్దగా సాంగ్స్, ఫైట్స్‌ లేవు. సెంట్రల్‌ క్యారెక్టర్‌ కూడా నీది కాదు. ‘జై భీమ్‌’ చేయొద్దు’’ అని నాకు చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ చేశాను. ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’!), ‘జై భీమ్‌’ చిత్రాలు నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. మరిన్ని విభిన్నమైన సినిమాలు చేయాలనే తపనను నాలో కలిగించాయి. ‘ఆకాశం నీ హద్దురా’లో పెద్దగా స్టంట్‌ సీక్వెన్స్‌ లేవు. ‘జై భీమ్‌’ చిత్రంలో లవ్, సాంగ్‌ సీక్వెన్స్‌లు అవసరం పడలేదు. అయినా ‘జై  భీమ్‌’ చిత్రం చాలామందిలో ఓ మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. సమాజానికి ఉపయోగపడే సినిమాలు మరిన్ని వచ్చేలా ప్రేరేపించిందని అనుకుంటున్నాను. ప్రతి సినిమా కూడా మన సమాజాన్ని, వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేసేలా ఉండాలనే కోరుకుంటాను. ఎప్పుడూ ఫ్యాంటసీ, భారీ కమర్షియల్‌ చిత్రాలే కాదు.. సమాజంలో మంచి మార్పు తీసుకొచ్చే సినిమాలూ రావాలి.

► ఒకప్పుడు రంగస్థల నటులు వేదికలపై వినోదాన్ని పంచేవారు. ఆ తర్వాత థియేటర్స్‌ వచ్చాయి. ఆ తర్వాతి తరంలో టెలివిజన్ల ప్రభావం పెరిగింది. ఇప్పుడు ఓటీటీల్లో సినిమాలు చూస్తున్నారు. ఉదాహరణకు నా పిల్లలు ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం యూట్యూబ్‌నే చూస్తున్నారు. ఇలాంటి మార్పులను మనం ఆపలేం. జాగ్రత్తగా డీల్‌ చేయాల్సిందే. కానీ ఎలాంటి కంటెంట్‌ టీవీల్లో రావాలి? ఏ విధమైన కంటెంట్‌ థియేటర్స్‌లో ఉండాలి? ఏ రకమైన కంటెంట్‌ ఓటీటీకి కరెక్ట్‌ అనే అంశాలపై మరింత అవగాహనతో ఉండాల్సిన అవసరం ఉంది. మంచి సినిమా అయినా థియేటర్స్‌లో మూడు రోజులు మాత్రమే ఉంటుంది. అదే ఓటీటీలో అయితే వ్యూయర్స్‌ వారికి వీలైన టైమ్‌లో ఆ సినిమాను చూడగలిగే వీలుంటుంది. అలాగే కొత్త ఆడియన్స్‌ వస్తున్నారు. ఓటీటీ వల్ల సినిమాను ఎక్కువమంది చూడగలుగుతున్నారు. ఇండస్ట్రీ కూడా పెరుగుతోంది.

► ‘జై భీమ్‌’ చిత్రం ఆస్కార్‌ నామినేషన్‌ వరకు వెళ్లడం, ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకోవడం నాకు సంతోషాన్నిచ్చింది. ఆస్కార్‌ బరిలో నిలవడం అనేదానికి ఓ ప్రాసెస్‌ ఉంటుంది. ఒక సినిమా ఆస్కార్‌కి వెళ్లాలంటే యూఎస్‌లోని ఐదారు రాష్ట్రాల్లో స్క్రీనింగ్‌ జరగాలి. అక్కడి థియేటర్స్‌లో కనీసం వారం రోజుల ప్రదర్శన ఉండాలి. అయితే కరోనా వల్ల డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌ అయిన సినిమాలను కూడా ఈసారి పరిశీలనలోకి తీసుకున్నారు. నిజానికి మేం స్పెషల్‌ కేటగిరీలో అప్లై చేయాల్సింది. జనరల్‌ కేటగిరీలో చేశాం.

► బాలాగారి దర్శక త్వంలో నా తర్వాతి సినిమా స్టార్ట్‌ అవుతుంది. ఆ నెక్ట్స్‌ వెట్రిమారన్‌ దర్శకత్వంలో చేస్తున్న ‘వాడివాసల్‌’ సినిమా షూటింగ్‌ని స్టార్ట్‌ చేస్తాం
 

 ‘ఈటీ’లో యాక్షన్, ఫైట్స్, కామెడీ.. ఇలా అన్నీ ఉన్నాయి. అయితే వీటితో పాటు ఇంతకుముందు ఎవరూ ప్రస్తావించని, మన ఇంట్లో మనం చర్చించుకోవడానికి సంకోచించే ఓ కొత్త అంశాన్ని చిన్న సందేశంగా చెప్పే ప్రయత్నం చేశాం. మహిళల జీవితాల్లోని అంశాల గురించే ఈ సినిమా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement