సుశాంత్‌ అందుకే ఆత్మహత్య చేసుకున్నాడు: తండ్రి | Sushant Father Statement Says Feel Eliminates Himself Out Of Dejection | Sakshi
Sakshi News home page

సుశాంత్‌ మృతి కేసు: ఆయన తండ్రి ఏం చెప్పారు?

Published Thu, Sep 3 2020 8:45 AM | Last Updated on Thu, Sep 3 2020 9:18 AM

Sushant Father Statement Says Feel Eliminates Himself Out Of Dejection - Sakshi

ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బిహార్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సుశాంత్‌ డిప్రెషన్‌ గురించి తమకు తెలియదని పేర్కొన్న అతడి కుటుంబ సభ్యులు ముంబై పోలీసుల ఎదుట ఇచ్చిన వాంగ్మూలం పలు అనుమానాలకు తావిస్తోంది. సుశాంత్‌కు ఉన్న మానసిక సమస్యల గురించి తమకు ఆరేళ్ల క్రితమే తెలుసునని, ఈ విషయమై అతడు సైక్రియాటిస్ట్‌ను కూడా కలిసినట్లు అతడి సోదరి మీతూ సింగ్‌ తెలిపారు. ఇక తన కుమారుడి నుంచి డబ్బు తీసుకుని, మోసం చేసి, ఆత్మహత్య చేసుకునేలా ప్రోత్సహించిందని సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ నటి రియా చక్రవర్తిపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన బిహార్‌ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. రియా తమను సుశాంత్‌కు దూరం చేసిందని, అతడిదో మాట్లాడకుండా అడ్డుపడిందని ఆరోపించారు. అయితే ముంబై పోలీసుల విచారణలో మాత్రం ఆయన చేసిన వ్యాఖ్యలు, మీతూ సింగ్‌ వ్యాఖ్యలకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. (చదవండి: కీలక విషయాలు వెల్లడించిన సుశాంత్‌ సోదరి)

‘‘నా కొడుకు సుశాంత్‌ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో నాకు తెలియదు. తను డిప్రెషన్‌తో బాధ పడుతున్నట్లుగా, టెన్షన్‌లో ఉన్నట్లు నాతో ఎప్పుడూ చెప్పలేదు. సుశాంత్‌పై నాకెలాంటి అనుమానం గానీ, ఫిర్యాదు గానీ లేదు. నిరాశలో కూరుకుపోయి సుశాంత్‌ బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నా. నా కొడుకు సుశాంత్‌ 13-5-2019లో కేశ ఖండన కార్యక్రమంలో పాల్గొనేందుకు పట్నాకు వచ్చాడు. ఆ తర్వాత 16-5-2019 నాడు ముంబైకి తిరిగి వెళ్లాడు. నేను తనకు వాట్సాప్‌లో మెసేజ్‌ చేసేవాడిని. తను నాకు రిప్లై ఇచ్చేవాడు. నా వాంగ్మూలాన్ని మరాఠీలో రాతపూర్వంగా నమోదు చేశారు. దానిని నాకు హిందీలో వివరించారు. అంతా సరిగ్గానే ఉంది’’అని కేకే సింగ్‌ పేర్కొన్నట్లుగా ఉన్న వాంగ్మూల కాపీ తమకు లభించినట్లు ఓ ప్రముఖ జాతీయ మీడియా వెల్లడించింది. (చదవండి: సుశాంత్ కుటుంబంపై రియా న్యాయ‌పోరాటం!)

ఇక ఈ విషయంపై స్పందించిన నటుడి ఫ్యామిలీ లాయర్‌ వికాస్‌ సింగ్‌.. సుశాంత్‌ మానసిక ఆరోగ్యం గురించి జరుగుతున్న ప్రతికూల ప్రచారంపై అతడి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. ముంబై పోలీసులు వారి వాంగ్మూలాన్ని మరాఠీలో రాశారని, దాని బయటకు చదివి వినిపించలేదని ఆరోపించారు. అదే విధంగా సుశాంత్‌ సోదరీమణులతో బలవంతంగా ఆ స్టేట్‌మెంట్లపై సంతకం చేయించారని ఆరోపణలు చేశారు. ‘‘రియా చక్రవర్తే సుశాంత్‌ సమస్యలకు కారణమని ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. సుశాంత్‌కు అందించిన చికిత్స గురించి ఆమె అతడి కుటుంబానికి తెలియనివ్వలేదు’’అని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. సుశాంత్‌ సోదరి నీతూ, ఆమె భర్త, హర్యానా సీనియర్‌ పోలీసు అధికారి ఓపీ సింగ్‌ ఆధ్వర్యంలో తన వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు సమాచారం. కాగా సుశాంత్‌ మృతి కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాతో పాటు ఆమె తండ్రి, సోదరుడు షోవిక్‌ చక్రవర్తిని సీబీఐ విచారించింది. ఇక రియాపై మనీ లాండరింగ్‌ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆమె ఈడీ ఎదుట కూడా హాజరైన విషయం తెలిసిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement