
పట్నా: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తిపైన పట్నాలోని రాజీవ్ నగర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సుశాంత్ మృతిపై ఆయన తండ్రి కృష్ణ కుమార్‌సింగ్ ఫిర్యాదుతో రియాపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. సుశాంత్ అకౌంట్ నుంచి రూ.15 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయినట్లు గుర్తించారు. ఆయనకు సంబంధించిన ఆర్థిక అంశాలతో పాటు ఇతర విషయాలను రియా స్వయంగా పర్యవేక్షించినట్లు తెలిపారు. ఈ మేరకు రియాను బుధవారం విచారించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
‘సుశాంత్ తండ్రి కేకే సింగ్ తన ఆరోగ్య సమస్యల కారణంగా కేసుపై పోరాడడానికి ముంబై వెళ్లలేనని చెప్పారు. దాంతో రాజీవ్ నగర్ పోలీసు స్టేషన్‌లో రియాపై కేసు నమోదు చేశాము. రియా సుశాంత్ బ్యాంక్ ఖాతా నుంచి రూ. 15 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు గుర్తించాము’ అని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(పట్నా) సంజయ్ సింగ్ తెలిపారు. తన కుమారుడికి సంబంధించిన నగదు, ఆభరణాలు, ల్యాప్‌టాప్, క్రెడిట్ కార్డు, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు రియా వద్ద ఉన్నట్లు కేకే సింగ్ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. కాగా, జూన్ 14న సుశాంత్ ముంబైలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment