
ముంబై : బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. సుశాంత్ ఆత్మహత్య కేసులో తాజాగా ప్రముఖ దర్శకుడు మహేష్‌భట్‌ను ముంబై పోలీసులు ప్రశ్నించారు. జూలై 27న శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్‌కు హాజరైన మహేష్ భట్‌ను కొన్ని గంటలపాటు విచారించిన పోలీసులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మహేష్ భట్‌తోపాటు కరణ్ జోహార్ మేనేజర్‌ను కూడా విచారణకు హాజరు కావాలని మహారాష్ట్ర హోశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కోరారు. అలాగే నటి కంగనా రనౌత్‌ను కూడా వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు రావాలని సూచించారు. (అక్కడికి రావాలనిపిస్తోంది అక్కా: సుశాంత్)
కాగా జూన్ 14న బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖుల వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటి వరకు సంజయ్ లీలా భన్సాలీ, ఆదిత్యా చోప్రా, రియా చక్రవర్తి సహా 37 మందిని పోలీసులు విచారించారు. ఇప్పుడు మహేష్ భట్‌ను పోలీసులు విచారించారు. ఈ విచారణలో తను సుశాంత్‌ను కేవలం రెండు సార్లు మాత్రమే కలిసినట్లు మహేష్ భట్ వెల్లడించారు. నవంబర్ 2018లో ఒకసారి, 2019 జనవరిలో మరోసారి అని పేర్కొన్నారు.
(‘మరోసారి నా హృదయం ముక్కలైంది’)
‘సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి నా 2018 చిత్రం 'జలేబీ'లో పనిచేసింది. ఆ సమయంలో కలిసి పనిచేయడం వల్ల రియా నన్ను ఒక మెంటర్‌గా గౌరవించేది. నా చిత్రాల్లో నటించాలని సుశాంత్ నటించాలని ఏ రోజు కోరలేదని ఆ ఉద్దేశ్యం నాకు లేదు’ అని తెలిపారు. అయితే సడక్-2 సినిమాలో ముందుగా సుశాంత్‌ను అడిగి ఆ తర్వాత ఆదిత్యారాయ్ కపూర్‌ను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయని ప్రశ్నించగా అలాంటిదేం లేదని, 'సడక్ 2' లో నటించడానికి సుశాంత్‌తో చర్చలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. (‘దిల్ బేచారా’ మరో రికార్డు)
అంతేగాక దివంగత నటుడు సుశాంత్ తనతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపించాడని కూడా వెల్లడించాడు. తన ప్రాజెక్టులలో తనకు కనీసం ఒక చిన్న పాత్ర ఇవ్వమని కోరాడని భట్ తెలిపారు. ఇదిలావుండగా సుశాంత్ మరణంపై సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న నటి కంగనా రనౌత్‌కు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. మున్ముందు ఈ విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.