ఎస్వీ కృష్ణారెడ్డి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కుటుంబ సమేతంగా చూడగలిగే సినిమాలు, మధ్యతరగతి విలువలు, భాదల్ని చెప్పే సినిమాలు తీస్తూ ఎన్నో విజయాలు అందుకున్న దర్శకుడు ఆయన. ‘‘మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, అభిషేకం, యమలీల, శుభలగ్నం, మావి చిగురు, పెళ్ళాం ఊరెళితే, ఘటోత్కచుడు, యమలీల, ఎగిరే పావురమా’’ వంటి ఎన్నో హిట్ క్లాసిక్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు ఎస్వీ కృష్ణారెడ్డి. కేవలం డైరెక్టర్‌గానే కాదు తన సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్‌గా, నటుడిగా, రచయితగా కూడా పని చేశారు.
చివరిసారిగా 2014లో యమలీల 2 తీశారు. అయితే ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. దాదాపు ఎమిమిదేళ్ల తర్వాత ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టి రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్బంగా తనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘మాది మంచి ఉన్నతమైన కుటుంబమే. కానీ సినిమాలు తీసేంత డబ్బు లేదు. పీజీ పూర్తి చేశాక హీరో అవుదామని మద్రాస్ వెళ్లాను. కానీ అది అంత తేలికైన విషయం కాదని నాకు అర్థమైంది. నా తొలి సినిమా పగడాల పడవులు. ఇందులో సెకండ్ హీరోగా చేశాను.
ఆ సినిమా చూసి అచ్చిరెడ్డి ‘నువ్వు ఇది కాదు చేయాల్సింది అనిపిస్తోంది అన్నారు’. మనమే సినిమా తీద్దాం, నువ్వు హీరోగా చేయాలి అన్నారు. డబ్బు లేదు కదా ఎలా అని ఆలోచించాం. డబ్బు సంపాదించి సినిమా తిద్దాం అన్నారు. అందుకోసం అచ్చిరెడ్డి పేరు మీదే స్వీట్ షాప్ పెట్టాం. అందులో నేను కాజాలు.. లడ్డూలు చేసేవాడిని. అదే సమయంలో నేను ఆడిషన్స్ ఇస్తుండేవాడిని. అలా మా బిజినెస్‌తో కూడబెట్టిన డబ్బుతో ‘కొబ్బరిబొండం’ సినిమా తిశాం. తొలి ప్రయత్నంతోనే హిట్ కొట్టాం’ అంటూ చెప్పుకొచ్చారు.
‘‘ఆ తర్వాత అంతా మొదట్లో నాకు ఏం రాదంటూ అందరు విమర్శించేవారు. ‘ఎస్వీ కృష్ణారెడ్డికి డైరెక్షన్ రాదు .. సంగీతం రాదు.. ఘోస్ట్‌లను పెట్టుకుని మ్యానేజ్ చేస్తుంటాడు’ అని అంతా కామెంట్స్ చేసేశారు. వారు అలా అనుకోవడం తప్పులేదు. ఎందుకంటే నేను ఎవరి దగ్గర పని చేయలేదు. డైరెక్షన్ డిపార్టుమెంటులో కానీ, సంగీతంలో కానీ ఎవరి దగ్గర చేరలేదు. ఇక నాటకాలు కూడా రాయలేదు. అందువల్లే అందరూ నేను టీం పెట్టుకుని నడిపిస్తున్నా అనుకునేవారు. అలా నాపై తరచూ విమర్శలు వస్తుండేవి. అది సహజమే. కానీ సినిమా అనే పిచ్చి ఉంటే అది ఏ పనైనా చేయిస్తుంది’’ అని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment