‘‘ఇండస్ట్రీలో అందరిలానే మేం కూడా మంచి హిట్ సాధించాలనే ‘లక్కీ లక్ష్మణ్’ తీశాం. ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. అయితే మా సినిమా ప్రివ్యూ చూసిన ఓ సీనియర్ నిర్మాత ‘సోహైల్ నువ్వు సేఫ్’ అన్నారు.. ఆ మాట చాలనిపించింది’’ అని సయ్యద్ సోహైల్ అన్నారు. ఏఆర్ అభి దర్శకత్వంలో ‘బిగ్ బాస్’ ఫేమ్ సయ్యద్ సోహైల్, మోక్ష జంటగా తెరకెక్కిన చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. హరిత గోగినేని నిర్మించిన ఈ సినిమా నేడు(డిసెంబర్ 30) విడుదలవుతోంది.
ఈ సందర్భంగా సోహైల్ మాట్లాడుతూ – ‘‘బిగ్‌బాస్’ షో తర్వాత నేను కమిట్ అయిన తొలి చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ఇంకా రిలీజ్ కాకపోవడంతో డిప్రెషన్‌కి లోనయ్యాను. ఆ తర్వాత ‘బూట్‌కట్ బాలరాజు’, ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’, ‘లక్కీ లక్ష్మణ్’ సినిమాలు చేశాను. అయితే ‘లక్కీ లక్ష్మణ్’ ముందు విడుదలవుతోంది. ఫ్యామిలీతో సహా యూత్‌కు నచ్చే అందమైన ప్రేమకథ ఇది. మన లైఫ్‌లో కష్టంతో పాటు అదృష్టం కూడా కావాలి.
నేను సినిమాల్లోకి వెళతానన్నప్పుడు మా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఎవరూ నన్ను సపోర్ట్ చేయలేదు. కానీ, మా నాన్న సలీం మాత్రం నాపై నమ్మకంతో వెళ్లమన్నారు. హైదరాబాద్ వచ్చాక సీరియల్స్‌లో నటిస్తూ నెలకు 40 వేలు సంపాదించేవాణ్ణి. అందులో సగం ఇంటికి పంపేవాణ్ణి. ఆ తర్వాత ‘బిగ్ బాస్’ చాన్స్ వచ్చింది.. ఆ షో తర్వాత సినిమా చాన్స్‌లు వస్తున్నాయి.
అభిగారు ‘లక్కీ లక్ష్మణ్’ని బాగా తీశారు. మా నిర్మాత హరితగారు సినిమాపై నమ్మకంతో సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. ఇక ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’లో హీరోగా నన్ను తీసుకోవద్దని కొందరు చెప్పినా నాకే అవకాశం ఇచ్చిన ఎస్వీ కృష్ణారెడ్డిగారి మేలు ఎప్పటికీ మరచిపోలేను.
వ్యక్తిగతంగా ‘సోహైల్ హెల్పింగ్ హ్యాండ్స్’ పేరుతో నాతో పాటు 30 మంది స్నేహితులు కలిసి సాయం చేస్తున్నారు. ఇప్పటివరకు ఐదుగురికి గుండె ఆపరేషన్ చేయించాం. ఏడు కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నాం. 10 మంది పిల్లల విద్యకి సాయం చేస్తున్నాం. ఇప్పుడు నా చేతిలో నాలుగు సినిమాలున్నాయి’’ అన్నారు.
‘ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే కొంత మంది నెగటివ్‌గా తీసుకుంటున్నారు. కొందరైతే సోషల్ మీడియాలో మా ఇంట్లోని వాళ్లను కూడా తిడుతున్నారు.. అందుకే నేను రియాక్ట్ అయ్యాను. అలా అవటం సమస్య అవుతోంది. ‘నా సక్సెస్‌కు మా నాన్నే కారణం’ అని ప్రీ రిలీజ్‌లో మాట్లాడిన ΄పాజిటివ్ వార్తకి కేవలం 500 వ్యూస్ మాత్రమే వచ్చాయి. అదే ‘ఇచ్చిపడేస్తా కొడకల్లారా’ అని అన్న మాటకు లక్షా ఇరవై వేల వ్యూస్, 700 కామెంట్స్, షేర్స్ వచ్చాయి. నెగిటివ్‌ని అంతగా ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కావటం లేదు’ అని సోహైల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment