ఉత్తరాది సినీ అందగత్తెల్లో నటి తాప్సీ ఒకరు. ఆరంభ దశలో అందాలనే నమ్ముకున్న ఈమె తెలుగు, తమిళం భాషల్లో పాత్రల్లోనే ఎక్కువగా నటించారు. ఇంకా చెప్పాలంటే దక్షిణాదిలో గ్లామరస్ పాత్రలే తాప్సీని నటిగా నిలబెట్టాయి. అయితే తమిళంలో ధనుష్ సరసన ఆడుగళం చిత్రంలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు. కాంచన, గేమ్ ఓవర్ వంటి చిత్రాలు అవకాశం ఉన్న పాత్రలో నటించి సత్తా చాటారు.
అయితే ఈమె ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాలపై దృష్టి సారించారు. అక్కడ హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటించి వరుసగా విజయాలు అందుకున్నారు. దీంతో దక్షిణాది చిత్రాలకు దాదాపు దూరమయ్యారు. అలాంటిది ఇటీవల దక్షిణాది చిత్రాలపై మక్కువ చూపుతున్నారనిపిస్తోంది. తాప్సీ తాజాగా ఏలియన్ అనే తమిళ చిత్రంలో నాయకిగా నటిస్తున్నారు. కాగా ఇటీవల ఆమె ఒక భేటీలో ఆదిలో తాను ఎదుర్కొన్న ఆటంకాలను, అవమానాలను ఏకరువు పెట్టారు. తాను దక్షిణాదిలో నటించిన కొన్ని చిత్రాలు ఆశించిన విజయాలను సాధించలేదన్నారు. ముఖ్యంగా తెలుగులో నటించిన చిత్రాలు ప్లాప్ అయ్యాయన్నారు. దీంతో అందరూ తనపై రాశిలేని నటి అనే ముద్ర వేశారన్నారు.
అయినా చిత్రాలు అపజయం పాలైతే ఆ నెపాన్ని ఎందుకు హీరోయిన్లపై నెట్టేస్తారా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిజం చెప్పాలంటే కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్ పరిధి కొన్ని సన్నివేశాలు పాటలకు వరకేనన్నారు. అలాంటిది చిత్రాల అపజయాలకు హీరోయిన్లను ఎలా బాధ్యుల్ని చేస్తారని ప్రశ్నించారు. తన విషయం లోనూ ఇదే జరిగిందని, ఇలాంటి వాటికి ఆరంభంలో ఆవేదన చెందినా, ఆ తరువాత విమర్శకులను పట్టించుకోవడం మానేశానన్నారు. తాను సినిమా నేపథ్యం నుంచి వచ్చిన నటిని కాదని, అందువల్ల ఎలాంటి కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటించాలో తెలియలేదని పేర్కొన్నారు. అలా చేసిన తప్పులనుంచి చాలా నేర్చుకున్నానని తాప్సీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment