
కరోనా నుంచి తమన్నా ఎలా కోలుకున్నారు? కరోనా సెకండ్ వేవ్ గురించి తమన్నా అభిప్రాయం ఏంటి? డిజిటల్ కంటెంట్ గురించి ఈ బ్యూటీ ఏమంటున్నారు? తెలంగాణ యాసలో డైలాగులు చెప్పడం ఎలా అనిపించింది? వంటి విషయాలు తెలుసుకోవాలనుందా? అయితే తమన్నా పంచుకున్న విశేషాల్లోకి వెళదాం.
కొన్ని రోజులుగా సంభవిస్తున్న హృదయవిదారక ఘటనలను వింటుంటే మనసుకు ఎంతో బాధగా ఉంది. కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో ఎన్నో క్లిష్టతరమైన సమస్యలను ఎదుర్కొన్నాం. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ ప్రాణాంతకంగా మారి, అందర్నీ భయపెడుతోంది. వేల సంఖ్యలో నమోదవుతున్న మరణాలు నన్ను తీవ్రంగా కలచివేస్తున్నాయి. గత ఏడాది కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో ఆగస్టులో నా తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారు. తర్వాత అక్టోబరులో నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అంటే.. మా తల్లిదండ్రులకు కరోనా వచ్చిన నెల రోజుల తర్వాతే నాకు పాజిటివ్ వచ్చింది. కానీ సెకండ్ వేవ్‌లో ఇలా కాదు. ఒక కుటుంబంలోని ఒకరికి కరోనా సోకితే, ఆ కుటుంబంలోని మిగతావారికి వెంటనే పాజిటివ్ వస్తోంది. అది కూడా విభిన్నమైన లక్షణాలతో కరోనా సోకుతుండటం విచారకరం. అందుకే కరోనా నియంత్రణ చర్యలను పాటించండి. దయచేసి జాగ్రత్తగా ఉండండి.
థియేటర్స్ తిరిగి ఓపెన్ చేసేవరకు వ్యూయర్స్ డిజిటల్ కంటెంట్‌నే ఫాలో అవ్వాల్సిన పరిస్థితి. సినిమా, వెబ్ సిరీస్‌లు అనేవి డిఫరెంట్ జానర్స్. కానీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ వేరు. మన వినోదపు సంస్కృతిలోనే థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ది పెద్ద స్థాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో డిజిటల్ రిలీజ్ తప్పదు. ఇటీవల నేను నటించిన వెబ్ సిరీస్ ‘నవంబరు స్టోరీస్’కు వ్యూయర్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఈ వెబ్ సిరీలో అనురాధా గణేశన్ పాత్ర చేశాను. దర్శకురాలు ఇంద్రా సుబ్రమణియన్ బాగా డైరెక్ట్ చేశారు. కథకు తగ్గట్లు మానవీయ భావోద్వేగాలను వీలైనంత సింపుల్‌గా, సహజంగా చిత్రీకరించడం ప్లస్ అయ్యింది.
ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాల్లో ‘సీటీమార్’ ఒకటి. ఈ చిత్రంలో తెలంగాణ కబడ్డీ కోచ్ జ్వాల రెడ్డి పాత్రలో కనిపిస్తాను. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. ఇంతకుముందు నేను చేసిన ఓ తెలుగు సినిమాకు డబ్బింగ్ చెప్పాను. దర్శకుడు సంపత్ నంది ప్రోత్సాహంతో ‘సీటీమార్’లో తెలంగాణ యాసతో డబ్బింగ్ చెప్పగలిగాను. ముందు కొంచెం చెప్పాను. బాగుండటంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. తర్వాత మొత్తం చెప్పేశాను.
కరోనా నుంచి కోలుకున్న తర్వాత తిరిగి నార్మల్ కావడానికి నాకు రెండు నెలలు పట్టింది. అవి చాలా క్లిష్టతరమైన పరిస్థితులు. ఆ సమయంలో వ్యాయామాలు చేయడం చాలా కష్టంగా అనిపించింది. కొన్ని సందర్భాల్లో అయితే చాలా నీరసంగా ఉండేది. కష్టంగా అనిపించేది. కోవిడ్ తర్వాత నా శరీరం పనిచేసే, స్పందించే తీరును అర్థం చేసుకుని, అందుకు తగ్గట్లు నేను నడుచుకోవడం వల్లే తొందరగా కోలుకోగలిగాను.
2018లో సూపర్‌హిట్ సాధించిన హిందీ చిత్రం ‘అంధా ధున్’ తెలుగు రీమేక్ ‘మాస్ట్రో’లో నటిస్తున్నాను. హిందీలో టబు చేసిన పాత్రను తెలుగులో నేను చేస్తున్నాను. హిందీ వెర్షన్ నాకు బాగా నచ్చింది. కానీ ‘అంధా ధున్’ తెలుగు రీమేక్ సైన్ చేసిన తర్వాత ఒరిజినల్ వెర్షన్‌ను నేను ఒక్కసారి కూడా చూడలేదు. నటనలో నా శైలిని కోల్పోతానేమోనని చూడలేదు. టబు మంచి నటి. అయితే ఈ పాత్రకు సంబంధించి తెలుగులో కొన్ని మార్పులు ఉన్నాయి. వయసు, కథనం దృష్ట్యా నా పాత్రలో మార్పులు ఉన్నాయి. అందుకే ‘మాస్ట్రో’ రిలీజ్ తర్వాత టబూతో నాకు పోలికలు పెడితే నేను పెద్దగా బాధపడను. ఇంకా ‘ఎఫ్ 3’, ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాల్లోనూ నటిస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment