ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘లబ్బర్ పందు’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
ప్రపంచంలో ప్రతి ఒక్క ఆటకు ఆయా ప్రాంతాన్ని బట్టి కొంత ప్రత్యేకత సంతరించుకుంది. మన భారతదేశంలో క్రికెట్ ఆటకి ఉన్న క్రేజ్ మరే ఆటకు లేదు అన్నది అక్షర సత్యం. క్రికెట్ ఆధారంగా గతంలో చాలా సినిమాలే వచ్చాయి. కానీ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న తమిళ చిత్రం ‘లబ్బర్ పందు’ సినిమా వాటన్నిటికీ అతీతమనే చెప్పాలి. ఈ సినిమా దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు క్రికెట్ ఆట స్ఫూర్తిగా ఓ చక్కటి ప్రేమకథను బ్యాక్‌గ్రౌండ్‌లో నడుపుతూ చెప్పిన విధానం అద్భుతమనే చెప్పాలి.
నేటివిటీకి నేచురాలిటీకి కేరాఫ్ అడ్రస్ సౌత్ ఇండియన్ సినిమాలు అన్నదానికి సవివర నిదర్శనం ఈ ‘లబ్బర్ పందు’ సినిమా. ఈ చిత్రం మాతృక తమిళమైనా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా హాట్‌స్టార్‌లో ఉంది. ఇక ‘లబ్బర్ పందు’ కథాంశానికొస్తే.. అన్బు అనే ఓ యువ క్రికెటర్ తన కులం వల్ల జాలీ ఫ్రెండ్స్ టీమ్‌లోకి చేరలేకపోతాడు. అన్బుకి క్రికెట్ అంటే చిన్నప్పటి నుండి ప్రాణం. అన్బు ఓ అద్భుతమైన ఆల్ రౌండర్ అని, అతన్ని టీమ్‌లోకి తీసుకోవాలని జాలీ ఫ్రెండ్స్ టీమ్ కెప్టెన్ కరుప్పాయ కూడా ప్రయత్నిస్తుంటాడు. మరో వైపు స్టార్ బ్యాట్స్‌మేన్ అయిన పూమలై సచిన్ బాయ్స్ టీమ్‌లో ఎవ్వరూ ఔట్ చేయని విధంగా పరిచయం చేస్తారు.
ఈ దశలో ఓసారి అన్బు, పూమలై తలపడాల్సి వచ్చి అన్బు... పూమలైని ఒక్క రన్ కూడా తియ్యనీయకుండా ఔట్ చేస్తాడు. దాంతో పూమలై అన్బు పై ద్వేషం పెంచుకుంటాడు. అలాగే అన్బు కూడా పూమలైపై కోపంతో ఉంటాడు. ఇంతలో అనుకోకుండా పూమలై కూతురు దుర్గతో ప్రేమలో పడతాడు అన్బు. దుర్గ... పూమలై కూతురన్న విషయం అన్బుతో పాటు అందరికీ తెలిసి రచ్చవుతుంది. తన శత్రువుకి తన కూతురుని ఎలా ఇస్తానని అన్బుతో పూమలై తలపడుతూ ఉంటాడు. ఆఖరికి పూమలైని అన్బు ఆటలో మళ్లీ ఓడించి దుర్గని దక్కించుకుంటాడా? లేక ఆటకు దూరమై దుర్గని వదిలేస్తాడా? అన్నది ‘లబ్బర్ పందు’ సినిమాలోనే చూడాలి. ఓ రకంగా చెప్పాలంటే... ప్రేక్షకుడు ఈ సినిమా చూస్తూ... జీవితాన్ని చూస్తున్న అనుభూతి ΄÷ందుతాడు. ముఖ్యంగా ఈ సినిమాలో పాత్రధారులందరూ నటించలేదు... జీవించారు. గల్లీ ప్రేమను సింపుల్‌గా గెలిపించిన ఈ ఆట ఓ అద్భుతం. మీరు కూడా ఓ లుక్కేయండి.
– ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment