‘‘రాజా విక్రమార్క కథతో పాటు నా పాత్ర కూడా బాగా నచ్చడంతో ఈ సినిమా చేశాను. ఇందులో నా పాత్ర పేరు కాంతి. తను హోమ్ మినిస్టర్ కుమార్తె అయినప్పటికీ చాలా సింపుల్‌గా ఉండే అమ్మాయి’’ అని తాన్యా రవిచంద్రన్ అన్నారు. కార్తికేయ, తాన్యా రవిచంద్రన్ జంటగా వీవీ వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాజా విక్రమార్క’. ఆదిరెడ్డి టి. సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా తాన్యా రవిచంద్రన్ మాట్లాడుతూ– ‘‘చిన్నతనం నుంచి నాకు సినిమాలంటే ఆసక్తి.
అయితే, మా పేరెంట్స్ ‘పీజీ పూర్తి చెయ్.. ఆ తర్వాతే సినిమాలు’ అన్నారు. అయితే పీజీ చేస్తున్న టైమ్‌లో చాన్స్ రావడంతో ఒక్క సినిమా చేస్తానని చెప్పాను. కానీ వరుసగా తమిళంలో మూడు సినిమాలు చేశాను. అవి పూర్తయ్యాక పీజీ (ఎంఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ – హెచ్‌ఆర్) పూర్తి చేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. మా తాతయ్య (తమిళ హీరో రవిచంద్రన్) చాలా హార్డ్ వర్కింగ్.. ఆయనకు అంకితభావం, క్రమశిక్షణ ఎక్కువ. ఆ మూడూ నేర్చుకున్నాను. నేను సినిమాల్లోకి వస్తా నని తెలియకముందే తాతయ్య మాకు దూరమయ్యారు. నాకు ఛాలెంజింగ్ పాత్రలంటే ఇష్టం. ప్రస్తుతం తమిళంలో ఐదు సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment