Telugu Film Chamber of Commerce Elections: Dil Raju Interesting Comments - Sakshi
Sakshi News home page

Dil Raju: ఫిలిం ఛాంబర్‌ ఎన్నికలు.. పోటీ చేయడం ఇష్టం లేదన్న దిల్‌ రాజు!

Published Sat, Jul 29 2023 5:19 PM | Last Updated on Sat, Jul 29 2023 6:29 PM

Telugu Film Chamber of Commerce Elections: Dil Raju Interesting Comments - Sakshi

తెలుగు ఫిలిం ఛాంబర్‌ కామర్స్‌(చలనచిత్ర వాణిజ్య మండలి) ఎన్నికలకు వేళైంది. దిల్‌ రాజు ప్యానెల్‌, సి కల్యాణ్‌ ప్యానెల్‌ మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఇప్పటికే హోరాహోరీగా సాగిన ప్రచారానికి తెర పడగా ఆదివారం ఉదయం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది. నాలుగు గంటలకు కౌంటింగ్‌ నిర్వహించి సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు.

ఫిలిం ఛాంబర్‌ కామర్స్‌లో నిర్మాతల సెక్టార్, డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్, ఎగ్జిబిటర్స్ సెక్టార్, స్టూడియో సెక్టార్ అనే నాలుగు విభాగాలున్నాయి. ఫిలిం ఛాంబర్లో మొత్తం 1600 మంది సభ్యులుండగా రేపు 900 మంది సభ్యులు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్‌ కామర్స్‌ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న నిర్మాత దిల్‌ రాజు తాజాగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న సభ్యులతో దిల్ రాజు ప్యానెల్ ఉంది. దిల్ రాజు ప్యానెల్ అంటేనే యాక్టివ్ ప్యానెల్. రేపు జరిగే ఎన్నికల్లో 4 విభాగాల సభ్యులు పాల్గొననున్నారు. ఈ నాలుగు విభాగాల్లో సమస్యలున్నాయి. మరీ ముఖ్యంగా ఎగ్జిబిటర్స్‌కు, నిర్మాతలకు సమస్యలు ఎక్కువ. వాటన్నింటిని పరిష్కరించేందుకు ఎన్నో కొత్త ఐడియాలతో మా ప్యానెల్‌ ముందుకు వస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీని అందరం ఐక్యతతో ఇంకా ముందుకు తీసుకెళ్తాము. 

ఒక వ్యక్తికి పది బ్యానర్లు ఉన్నా మనిషికి ఒక ఓటు ఉండాలి. ఇక్కడ సభ్యులు మొత్తం 1500 మంది పైన ఉన్నారు, కానీ యాక్టివ్‌గా ఉండేది 150 మంది మాత్రమే! మూడు సంవత్సరాలలో సినిమా తీసినవాళ్లు మాత్రమే ఈసీలో కూర్చోవాలని చెప్పాం, కానీ దానికి వాళ్లు ఒప్పుకోలేదు. ఇక్కడ సక్సెస్‌ లేకపోతే వెనకబడిపోతాం. అందుకనే మేము ప్రొడ్యూసర్‌ గిల్డ్‌ పెట్టాం. మాకున్న సమస్య.. ఛాంబర్‌ బైలాలో మార్పులు జరగాలి. బైలాను మార్చుకుంటే భవిష్యత్తు తరాలకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది.

నేను పోటీ చేయడం మా ఇంట్లో ఇష్టం లేదు, కానీ ఈ సభ్యుల కోసం నేను ఎలక్షన్స్‌లో నిలబడ్డాను. మా ప్యానెల్‌ను గెలిపిస్తే ఛాంబర్‌ను మరింత ధృడంగా మారుస్తాం. క్యూబ్‌ యూఎఫ్‌వో రేట్లు దేశంలో అన్ని చోట్ల ఒకటేగా ఉంది. ఇదిమన ఒక్క సమస్య కాదు అందరికీ ఇదే సమస్య. సౌత్, నార్త్ వాళ్ళందరిని కలుపుకొని క్యూబ్ ufo సమస్యని అధిగమించాలి. మాకు రెండు సంవత్సరాలు అవకాశం ఇస్తే మేము ఏమి చేస్తామో చూపిస్తాము' అని దిల్‌ రాజు పేర్కొన్నాడు.

చదవండి: పెళ్లైన ఆరేళ్లకే విడాకులు.. బాధ నుంచి బయటపడలేకపోతున్నా అంటూ
ప్రేమకు, పెళ్లికో దండం అంటూ జబర్దస్త్‌ రీతూ పోస్ట్‌.. ప్రియుడితో బ్రేకప్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement