సినీ దర్శకుడి కష్టాన్ని దొంగలు కూడా గుర్తించారు. తాము చేసిన దొంగతనానికి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ దర్శకుడికి లభించిన జాతీయ అవార్డు, వెండి పతకాన్ని అప్పగించి వెళ్లారు. సినీ తరహాలో ఆసక్తికరంగా మారిన ఈ దొంగతనం కేసు వివరాల్లోకి వెళ్తే.. కాకా ముట్టై వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన మణికందన్ సొంత నివాసం మధురై జిల్లా ఉసిలం పట్టి సమీపంలోని విలాం పట్టి ఎలిల్ నగర్‌లో ఉంది. సినిమా పనుల నిమిత్తం చెన్నైలో తన కుటుంబ సభ్యులతో ఉంటున్నారు.
ఈ నెల 8వ తేదీన మధురైలోని ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ విషయాన్ని గుర్తించిన దర్శకుడి డ్రైవర్ నరేష్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఇంట్లో ఉన్న 5 సవర్ల బంగారం, రూ. లక్ష నగదుతో పాటు కడేసి వ్యవసాయి చిత్రానికిగానూ మణికందన్‌కు లభించిన జాతీయ అవార్డు.. వెండి పతకం చోరీ అయినట్లు విచారణలో తేలింది. ఈ కేసును ఉసిలం పట్టి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆ ఇంటి ముందు ప్లాస్టిక్ కవర్ వేలాడుతూ ఉండటాన్ని గస్తీలో ఉన్న పోలీసులు గుర్తించారు. ఇందులో మణికందన్ గెలుచుకున్న వెండి పతకం ఉండడం విశేషం. అలాగే అందులో ఓ లేఖ కూడా బయట పడింది. అయ్యా.. మమ్మల్ని క్షమించండి.. మీ కష్టం మీకే.. అని రాసి ఉంది. దర్శకుడి కష్టాన్ని గుర్తించిన దొంగలు ఆయనకు లభించిన పతకాన్ని వెనక్కి తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
చదవండి: 22 ఏళ్ల ఏజ్ గ్యాప్.. ప్రేమకు సరైన నిర్వచనంగా నిలిచిన జంట
- పోడూరి నాగ ఆంజనేయులు
Comments
Please login to add a commentAdd a comment