అజయ్
‘‘ప్రయాణం అనేది ఎప్పుడూ ఒక్కడి వల్ల జరగదు. మనల్ని ప్రోత్సహించేవాళ్లు, సహాయం చేసేవాళ్లు.. ఇలా అందరి వల్లే మనం ముందుకు వెళ్లగలుగుతాం. నటుడిగా ఇరవై ఏళ్లు పూర్తయ్యాయంటే నమ్మబుద్ధి కావడం లేదు. చేయాల్సిన సినిమాలు, పాత్రలు ఇంకా ఎన్నో ఉన్నాయనే భావిస్తాను’’ అన్నారు నటుడు అజయ్. ఆయన కెరీర్ ప్రారంభం అయి 20 ఏళ్లు పూర్తయింది. ‘కౌరవుడు’ సినిమాతో పరిచయమయ్యారు అజయ్. ఆ తర్వాత ‘ఖుషీ, విక్రమార్కుడు, అతనొక్కడే, సారాయి వీర్రాజు.. దాదాపు 200కు పైనే సినిమాలు చేశారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో నటించారు. ఈ ప్రయాణం గురించి ఆజయ్ చెప్పిన విశేషాలు.
యాక్టర్ అయ్యే అదృష్టం కొద్ది మందికి మాత్రమే వస్తుంది. ఇంత పేరు, ప్రేమ పొందడం, ఇన్నేళ్లు కొనసాగడం కూడా అదృష్టమే. కళ్లుమూసి తెరిచేలోపు ఇరవైఏళ్లు అయిపోయాయి. కెరీర్ ప్రారంభంలో ఏం అర్థం కాకుండానే ఐదారేళ్లు గడిచిపోయాయి. పేరు రావడం కన్నా వచ్చినదాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఆ సమయంలోనే చాలా మంచి సినిమాలు, దర్శకులతో పని చేయడం నా లక్. నా దర్శకులు, నిర్మాతలు హ్యాపీగా ఉండాలని కోరుకునేవాణ్ణి. విలన్ అవుదాం అని వచ్చా. అయ్యాను. పాజిటివ్, నెగటివ్ అన్ని రకాల పాత్రలు చేశాను. ఇంకా విభిన్నమైన పాత్రలు చేయాలి. నాచ్యురల్‌గా చే యాలి. ప్రస్తుతం నా కెరీర్‌లో బెస్ట్ టైమ్ ఇది. మంచి పాత్రలు వస్తున్నాయి.
నాకు రానిదాన్ని చేయను
నేను చేసిన 95 శాతం పాత్రలు సెట్‌కి వెళ్లాక తెలుసుకున్నవే. హోమ్‌వర్క్ చేయాల్సిన పాత్రలకు కచ్చితంగా హోమ్ వర్క్ చేశాను. నటుడిగా నా బలమేంటో నాకు తెలుసు. నాకు రానిదాన్ని చేయను. ఒకవేళ చేయాల్సి వస్తే పూర్తిగా నేర్చుకుని కెమెరా ముందుకెళతాను. విభిన్న పాత్రలు చేయడం వల్ల మనిషిగా నాలో చాలా మార్పు వచ్చింది. ఇంతకు ముందు చాలా కోపం, ర్యాష్‌గా ఉండేవాణ్ణి. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటున్నాను. ఓపిక పెరిగింది. కృతజ్ఞతాభావం అలవడింది.
క్వాలిటీ వర్క్ చేయాలి
లాక్‌డౌన్‌లో అందరికీ ఆగి ఆలోచించే తీరిక దొరికింది. నేను నా పాత్రల గురించి ఆలోచించాను. ఇక మీదట ఇంకా మంచి పాత్రలు చేయాలి, క్వాలిటీ వర్క్ చేయాలనుకుంటున్నాను. మా పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు. వాళ్లకు చూపించడానికి మంచి పాత్రలు చేస్తా. ప్రస్తుతం ఆర్టిస్టులకు ఓటీటీలు ఓ వరం. వెబ్ సిరీస్‌లు చేయొచ్చు. ఇంకా భిన్న పాత్రలు చేయొచ్చు.
ఏదైనా ఒకేలా తీసుకుంటా
ప్రశంసలకు ఆనందపడిపోయి, విమర్శలకు కుంగిపోను. నా దారిలోకి ఏది వచ్చినా ఆనందంగా తీసుకుంటాను. బీ పాజిటివ్ అన్నది నా ఫిలాసఫీ. అలాగే ఇండస్ట్రీలో రిలాక్సేషన్ అనేది ఏదీ ఉండదు. నిరంతరం పరిగెడుతూనే ఉండాలి. ప్రస్తుతం నాలుగు వెబ్ సిరీస్‌లు చేస్తున్నాను. అలాగే నాలుగైదు పెద్ద సినిమాలు చేస్తున్నాను. పరిస్థితులు ఎలా ఉన్నా షో ఆగకూడదు. అందరూ పని చేస్తూనే ఉండాలి.
నా సినిమాల్లో నాకు నచ్చినవి ‘ఖుషీ, విక్రమార్కుడు, అతనొక్కడే, పోకిరి, ఇష్క్, ఆర్య 2, దిక్కులు చూడకు రామయ్య’ ఇవి టాప్‌లో ఉంటాయి. ఇప్పుడున్న సూపర్‌స్టార్స్ అందరూ స్టార్ట్ అవుతున్నప్పుడే నేను నా కెరీర్ ప్రారంభించా. దాంతో అందరితో యాక్ట్ చేసే చాన్స్ ఈజీగా వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment