సంధ్య థియేటర్ ఘటనతో తెలంగాణ ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో తెలుగు పరిశ్రమలో అలజడి మొదలైంది. ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ ప్రజాప్రతినిధులు పదునైన కామెంట్లు చేస్తున్నా సరే ఇండస్ట్రీ పెద్దల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. భవిష్యత్‌లో బెనిఫిట్‌షోలు, టికెట్ల రేట్లు పెంపు అనేది ఉండదని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమకు మధ్య దూరం పెరుగుతుందనే వాదన అందరిలోనూ మొదలైంది. మరోవైపు సంక్రాంతికి భారీ సినిమాలు రానున్నాయి. ఇందులో మెగా హీరో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రం కూడా ఉంది. ఈ మూవీ కోసం నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ పెట్టారు. ఈ సినిమా విడుదల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా భారీ మూల్యం చెల్లించక తప్పదని చెప్పవచ్చు.
కొద్దిరోజుల క్రితం ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా దిల్‌రాజు నియామకం అయ్యాక పుష్ప చేసిన డ్యామేజీకి ‘గేమ్ ఛేంజర్’ అవుతారని అందరూ భావించారు. దానిని నిజం చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వానికి, చిత్ర పరిశ్రమకు తాను మధ్యవర్తిగా ఉంటానని ఆయన అన్నారు. అందులో భాగంగానే అమెరికా నుంచి రాగానే సీఎం రేవంత్‌తో ఆయన సమావేశం అయ్యారు. చిత్రసీమ అభివృద్ధికి, సినిమాలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చే అంశంపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆ సమయంలో దిల్ రాజు ప్రకటించారు. స్వయంగా ముఖ్యమంత్రితో మాట్లాడి బయటకొచ్చిన తర్వాత దిల్ రాజు ఇచ్చిన స్టేట్ మెంట్ కావడంతో గేమ్ ఛేంజర్‌కు బెనిఫిట్‌షోలు, టికెట్ల రేట్లు పెంపు ఉంటాయని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు.
తాజాగా ఇండస్ట్రీ సమస్యల పేరుతో సీఎం రేవంత్‌తో సినీ పెద్దల మీటింగ్‌ను దిల్‌రాజ్ ఏర్పాటు చేశారు. తెలంగాణలో బెనిఫిట్‌షోలు, టికెట్ల రేట్లు పెంపు ఉండదని సీఎం ప్రకటించడంతో ఆ ఎఫెక్ట్ మొదట గేమ్ ఛేంజర్ మీద పడుతుందని దిల్ రాజు భావించారు. ఈ భేటీతో గేమ్ ఛేంజర్‌కు ప్రత్యేక అనుమతులు పొందవచ్చని ఆయన అడుగులు వేసినట్టు కనబడింది. ఈ సినిమా కోసం కోట్ల రూపాయలు దిల్ రాజు బడ్జెట్ పెట్టారు. గేమ్ ఛేంజర్‌కు బెనిఫిట్‌షోలు, టికెట్ల ధరలు పెంపు లేకుంటే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని చెప్పవచ్చు. ఈ సమస్య నుంచి ఎలాగైనా సరే బయటపడేందుకు సీఎం రేవంత్‌రెడ్డిని ఒప్పించేందుకు ఆయన ప్రయత్నం చేశారని తెలుస్తోంది.
తాజాగా సీఎంతో జరిగిన సమావేశంలో టికెట్ల రేట్లు పెంపుతో పాటు బెనిఫిట్‌షోల గురించి కూడా చర్చ వచ్చిందట. అయితే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం తాను అసెంబ్లీలో చెప్పిన మాటలకే కట్టుబడి ఉంటున్నానని.. అందులో తగ్గేదే లేదని ఆయన అన్నారట. చిత్ర పరిశ్రమ పెద్దలు కూడా సీఎంను ఒప్పించే ప్రయత్నం చేశారట. అయినప్పటికీ, ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ రేట్ల పెంపు ఉండదని రేవంత్ క్లియర్‌గా చెప్పేశారట. అంతే కాదు ప్రీరిలీజ్‌లు, సినిమా ఫంక్షన్లు, అభిమానుల గేదరింగులకు అనుమతులు ఉండాలంటే పక్కాగా నిబంధనలు పాటించాలని చెప్పారట. సినిమా పెద్దలు ఎంత ప్రయత్నించినా సీఎం రేవంత్ మాత్రం ‘తగ్గేదే లే’ అన్నారని సమాచారం. మొత్తానికి సీఎం రేవంత్ పైచేయి సాధించారని విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment