సన్ ఆఫ్ ఇండియా సింగిల్‌గా వచ్చాడు..
నారప్ప ఫ్యామిలీతో ఎంట్రీ ఇచ్చాడు..
ప్రేమికుడు విక్రమాదిత్య ప్రేమలోకంలో విహరిస్తున్నట్లు కనిపించాడు..
అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జనాల్లోంచి గాల్లో పైకి లేచారు..
టక్ జగదీష్ కుటుంబ సభ్యుల మధ్య నవ్వులు చిందించాడు...
ఇలా ఉగాది సందర్భంగా నిర్మాణంలో ఉన్న చిత్రాల ఫస్ట్ లుక్స్, కొత్త పోస్టర్లు విడుదలై, పండగ కళ తెచ్చాయి. ఆ విశేషాలు
డా. మోహన్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. టైటిల్‌ని బట్టి దేశం మీద ప్రేమ ఉన్న వ్యక్తిగా న్యాయం కోసం పోరాడే పాత్రలో మోహన్‌బాబు కనిపిస్తారని ఊహించవచ్చు. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని విష్ణు మంచు నిర్మిస్తున్నారు. నారప్పగా వెంకటేశ్ గెటప్ ఎలా ఉంటుందో ఇప్పటికే మనం చూశాం. పండగకి తన భార్య సుందరమ్మతో కలిసి వచ్చారు నారప్ప. సుందరమ్మ పాత్రను ప్రియమణి చేశారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మించిన చిత్రం ‘నారప్ప’. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత హీరో బాలకృష్ణ–దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రానికి ‘అఖండ’ అనే టైటిల్ ప్రకటించి, లుక్‌తో పాటు టీజర్‌ను విడుదల చేశారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 28న విడుదల కానుంది.
స్వాతంత్య్ర సమర యోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ (రౌద్రం.. రణం.. రుధిరం) . రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్ జనాల మధ్యలోంచి గాల్లోకి ఎగురుతున్న కొత్త పోస్టర్ పండగకి వచ్చింది. అక్టోబర్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథతో రూపొందుతున్న చిత్రం ‘రాధేశ్యామ్’. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు. ప్రేయసి ఏం చెప్పిందో ఏమో నవ్వుతూ కనిపించారు విక్రమాదిత్య (ప్రభాస్ పాత్ర పేరు). జులై 30న ఈ చిత్రం విడుదల కానుంది. సిద్ధ, నీలాంబరి ఒకరి కళ్లల్లోకి మరొకరు చూస్తూ ప్రపంచాన్ని మరచిపోయారు. వీరి ప్రేమకథను ‘ఆచార్య’లో చూడొచ్చు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సిద్ద పాత్రలో రామ్‌చరణ్, అతని సరసన నీలాంబరి పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయాలనుకుంటున్నారు. అనుకున్నట్లు జరిగితే నాని ‘టక్ జగదీష్’ ఈ నెల 23న విడుదలయ్యుండేది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందున వాయిదా వేశారు. కుటుంబ సమేతంగా జగదీష్ (నాని పాత్ర) తాజా పోస్టర్‌ను విడుదల చేశారు. శివ నిర్వాణ దర్శకత్వంలో సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుకున్నట్లు జరిగితే నాగచైతన్య, సాయి పల్లవితో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లవ్‌స్టోరీ’ని కూడా ఈ నెలే థియేటర్లలో చూసేవాళ్లం. కరోనా ప్రభావం వల్ల వాయిదా వేశారు నిర్మాతలు కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గని’. సయీ మంజ్రేకర్ హీరోయిన్. అల్లు బాబీ, సిద్ధు నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త పోస్టర్ రిలీజైంది. బస్సులో ప్రేయసిని ఆరాధనగా చూస్తున్నాడు ‘గల్లీ రౌడీ’.
సందీప్ కిషన్ హీరోగా కోన వెంకట్ సమర్పణలో జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘గల్లీ రౌడీ’. ఇందులో నేహా శెట్టి హీరోయిన్. షూటింగ్ జరుగుతోంది. పండగ వేళ నవ్వులు చిందించింది వెన్నెల. రానా హీరోగా వేణు ఉడుగుల దర్శకత్వంలో డి. సురేశ్‌బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. ఇందులో వెన్నెల పాత్రలో కనిపిస్తారు సాయి పల్లవి. ఈ 30న సినిమాని విడుదల చేయాలనుకున్నారు కానీ వాయిదా పడే అవకాశం ఉంది. అబ్బాయి, అమ్మాయి చెరోవైపు చూస్తూ నిలబడ్డారు. కథ ఏంటనేది ‘వరుడు కావలెను’ సినిమాలో చూడాలి. నాగశౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అద్దంలో బట్టతలతో, విడిగా చక్కని హెయిర్ స్టయిల్‌తో ప్రత్యక్షమయ్యాడు ‘101 జిల్లాల అందగాడు’. అవసరాల శ్రీనివాస్ హీరోగా రాచకొండ విద్యాసాగర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు, క్రిష్ సమర్పణలో శిరీష్, వై. రాజీవ్‌రెడ్డి, వై. సాయిబాబు నిర్మిస్తున్నారు. జీబీ కృష్ణ దర్శకత్వంలో ఆది సాయికుమార్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న ‘బ్లాక్’ లుక్ వచ్చింది. మహంకాళి దివాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటుడు అలీ కీలక పాత్ర చేస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’. శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో అలీ బాబ, కొణతాల మోహన్, శ్రీచరణ్. ఆర్ నిర్మిస్తున్నారు. రంజాన్, ఉగాది శుభాకాంక్షలతో ఈ సినిమా కొత్త పోస్టర్‌ని రిలీజ్ చేశారు. విశ్వక్ సేన్ హీరోగా ‘దిల్’ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న చిత్రం ‘పాగల్’. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కొత్త పోస్టర్ వచ్చింది. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తిమ్మరుసు’. మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. మే 21న ఈ చిత్రం విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment