సినిమా సెట్ అనుకున్నప్పుడే చూచాయగా రిలీజ్ డేట్ కూడా సెట్ చేస్తుంటారు మేకర్స్. అలా కాకపోయినా షూటింగ్ సగం పూర్తయ్యాక సెట్ చేస్తారు. వన్ ఫైన్ డే ఆ డేట్‌ని అధికారికంగా ప్రకటిస్తారు. కానీ.. సెట్ చేసిన డేట్‌కి కొన్ని సినిమాలు విడుదల కాకపోవచ్చు. సాంకేతిక కారణాలు, ఇతర కారణాల వల్ల వాయిదా పడుతుంటాయి. అలా ప్రస్తుతం అరడజను చిత్రాల దాకా వాయిదా పడ్డాయి. ఏ సినిమా కారణం ఆ సినిమాది. ఇక అనుకున్న డేట్‌కి రాకుండా కొత్త డేట్ సెట్ చేసుకుని సిల్వర్ స్క్రీన్ పైకి రానున్న సినిమాల గురించి తెలుసుకుందాం.
‘సలార్’లో ప్రభాస్
∙ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో భాగంగా ‘సలార్: పార్ట్ 1–సీజ్‌ఫైర్’ని ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు తొలుత మేకర్స్ ప్రకటించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలాఖరులో ప్రభాస్ ఫ్యాన్స్‌కి, సినిమా లవర్స్‌కి పండగే. అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నారంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. గ్రాఫిక్స్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో విడుదల వాయిదా పడనుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.
అయితే ‘సలార్’ రిలీజ్ వాయిదాపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అనేదానిపై పాన్ ఇండియా స్థాయిలో చర్చ జరుగుతోంది. తాజా అప్‌డేట్ ప్రకారం ఈ సినిమాని దీపావళి కానుకగా నవంబర్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ముందుగా అనుకున్నట్లు ఈ నెల 28న సినిమాని విడుదల చేస్తారా? లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి. శ్రుతీహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటించారు.
‘స్కంద’లో రామ్, శ్రీలీల
రామ్ పోతినేని హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘స్కంద’ కూడా ముందు అనుకున్న తేదీకి కాకుండా వేరే తేదీకి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వినాయక చవితి సందర్భంగా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గతంలో చిత్రబృందం ప్రకటించింది. అయితే తాజాగా మేకర్స్ సినిమా విడుదలను వాయిదా వేశారు. ఈ నెల 15న కాకుండా 28న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే సినిమా విడుదల తేదీ ఎందుకు మార్చాల్సి వచ్చిందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
‘చంద్ర ముఖి–2’లో కంగన
రజనీకాంత్ హీరోగా జ్యోతిక టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘చంద్రముఖి’ (2005). పి. వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘చంద్రముఖి 2’. తొలి భాగానికి దర్శకత్వం వహించిన పి. వాసునే రెండో భాగాన్ని తీశారు. అయితే సీక్వెల్‌లో హీరో, హీరోయిన్ మారారు. రాఘవ లారెన్స్ హీరోగా, కంగనా రనౌత్ టైటిల్ రోల్‌లో నటించారు.
సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా ఈ నెల 15న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ నెల 15న కాకుండా 28న విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. కొన్ని సాంకేతిక కారణాల వల్లే విడుదలను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా ‘చంద్రముఖి 2’ని తెలుగులో రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ ఉప్పుటూరి, వెంకట రత్నం శాఖమూరి రిలీజ్ చేస్తున్నారు.
‘ఆదికేశవ’లో వైష్ణవ్ తేజ్
వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆదికేశవ’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడింది. తొలుత ఈ చిత్రాన్ని జూలైలో రిలీజ్ చేయాలనుకున్నారు.. చేయలేదు. ఆ తర్వాత ఆగస్టు 18న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఆ తర్వాత అది కూడా వాయిదా పడి చివరికి నవంబర్ 10వ తేదీకి ఫిక్స్ అయింది. ఫారిన్‌లో కొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉండటం వల్లే విడుదల వాయిదా వేస్తున్నట్లు ‘ఆదికేశవ’ చిత్రబృందం ప్రకటించింది.
‘టిల్లు స్క్వేర్’లో సిద్ధు
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ‘డీజే టిల్లు’ (2022) సినిమా సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ రూపొందింది. ఈ చిత్రానికి డైరెక్టర్, హీరోయిన్ మారారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించారు. ‘డీజే టిల్లు’ని నిర్మించిన సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ మూవీని కూడా ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే విడుదల వాయిదా పడింది. ‘‘టిల్లు స్క్వేర్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. క్వాలిటీ ఔట్‌పుట్ కోసం విడుదల వాయిదా వేయక తప్పడం లేదు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అంటూ మేకర్స్ ప్రకటించారు.
‘పెద కాపు’లో విరాట్ కర్ణ
∙‘నారప్ప’ వంటి హిట్ మూవీ తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన చిత్రం ‘పెదకాపు–1’. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా నటించారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాని తొలుత ఆగస్టులో విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించినా, వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు? అనేదానిపై తాజాగా చిత్ర యూనిట్ స్పష్టత ఇచ్చింది. ఈ నెల 29న ‘పెదకాపు –1’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment