
టాలీవుడ్‍లో గత కొన్నిరోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నారు. అయితే తమకు 30 శాతం వేతనాలు పెంచాలని వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తుండగా.. నిర్మాతలు మాత్రం దీనికి అంగీకరించట్లేదు. తమ షరతులకు ఒప్పుకొంటేనే వేతనాల పెంపు ఉంటుందని అంటున్నారు. దీంతో ఈ సమస్య ఎటు తేలకుండా అలానే ఉంది. మెగాస్టార్ చిరంజీవి.. ఆదివారం పలువురు చిన్న నిర్మాతలు కలిశారు. సోమవారం ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు కలవనున్నారు. ఈ క్రమంలోనే ప్రొడక్షన్ అసిస్టెంట్ యూనియన్ ప్రెసిడెంట్ తమ సాధకబాధలు చెప్పుకొచ్చారు.
'రోజూ ఉదయం 5 గంటలకు వస్తేనే మా బతుకు. పెద్ద పెద్ద సినిమాలు తీసిన అప్పటి నిర్మాతలు మా కష్టాన్ని పట్టించుకునేవారు. కానీ ఇప్పటి నిర్మాతలకు మా గోడు పట్టడం లేదు. మాకు వచ్చే డబ్బులు.. మాకొస్తున్న జబ్బులకు సరిపోతుంది. కొందరు నిర్మాతలు వ్యక్తిగతంగా మమ్మల్ని దూషిస్తున్నారు. కార్మిక చట్టాల బట్టి అంటున్నారు మరి మీరు 8 గంటల వర్క్ చేయించుకుంటున్నారా ?? 12-14 గంటలు మేము పనిచేస్తున్నాం. 9 నుంచి 9 గంటల వరకు అని కొందరు నిర్మాతలు అంటున్నారు కానీ అది అయ్యే పనికాదు. షూటింగ్స్‌కి రావాలి అంటే మేము 9 గంటలకు కాకుండా మా వర్కర్స్‌ని 7 గంటలకే రమ్మనాలి. రాత్రి 9 గంటలకే షూట్ ముగిస్తారా అంటే అది చేయరు. మేము షూటింగ్ ముగించుకుని వచ్చేపాటికి రాత్రి ఒంటి గంట అయిపోతుంది'
(ఇదీ చదవండి: చిరుతో సినిమా.. క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు: టాలీవుడ్ నిర్మాత)
'12 గంటలు అంటారు కానీ మేము 15-16 గంటలు వర్క్ చేస్తున్నాం. కార్మిక చట్టాలు ప్రకారం వెళ్దామని కొందరు నిర్మాతలు అంటున్నారు మాకు అభ్యంతరం లేదు. చట్ట ప్రకారమే మాకు 8 గంటలు పని గంటలు ఉంటాయి. డొనేషన్ తీసుకుంటున్న డబ్బులతో ఆ కుటుంబానికి అండగా ఉంటున్నాం. యూనియన్ ఎప్పడు కార్మికుడికి అండగా ఉంటుంది నిర్మాతలు ఉండటం లేదు. మా గురువు గారు దాసరి.. అప్పుడు చెప్పిన పద్ధతి లోనే మేము వెళ్తున్నాం.
నిర్మాతలు మా పై చేస్తున్న దుష్ప్రచారాలను మానండి. చిరంజీవి గారికి మా సమస్యలు తెలుసు. మా సమస్యని పరిష్కరించాలని కోరుకుంటున్నాం' అని ప్రొడక్షన్ అసిస్టెంట్ యూనియన్ ప్రెసిడెంట్ వెంకట కృష్ణ చెప్పారు.
సినీ కార్మికుల మహిళా యూనియన్ ప్రెసిడెంట్ లలిత మాట్లాడుతూ.. మేము షూటింగ్‌లో ఎంతో కష్ట పడతాం. మాకు టాయిలెట్స్ కూడా ఉండవు. వాటర్ కేన్స్ కూడా భుజాన మోసుకొని వెళ్ళాలి. మా బాధలు నిర్మాతలు అర్థం చేసుకొవాలి. సండే కట్ చేస్తాం అంటున్నారు అలా చేస్తే మా పొట్ట కొట్టినట్టే. ప్రభుత్వం తరఫున మీటింగ్ పెడితే మా కష్టాలు తెలియ చేస్తాం అని అన్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ... తెలుగులోనూ)