‘నా కెరీర్‌లో ‘వర్షం’ సినిమా చాలా ప్రత్యేకం’ అన్నారు హీరోయిన్ త్రిష. ఇటీవల ఓ టీవీ షోలో తల్లి ఉమతో కలిసి పాల్గొన్నారు త్రిష. ‘మీ కెరీర్‌లో బాగా ఇబ్బంది పడిన సినిమా ఏంటి?’ అంటూ త్రిషని ప్రశ్నించారు యాంకర్. ఇందుకు ఆమె సమాధానం ఇస్తూ–‘‘నా కెరీర్‌లో ‘వర్షం’ మూవీ చాలా స్పెషల్. అలాగే ఎక్కువ ఇబ్బంది పడ్డ సినిమా కూడా అదే. నా కెరీర్ ఆరంభంలో ‘వర్షం’ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను. ఈ చిత్రం కోసం దాదాపు 45 రోజులు వర్షంలో షూటింగ్ చేశాం. ఆ సమయంలో తడవడంతో జలుబు, జ్వరంతో ఇబ్బంది పడ్డాను. ఒక దశలో సినిమా మానేసి వెళ్లిపోవాలనిపించింది.
అయితే ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో నా కష్టం మరచి పోయాను. తెలుగులో నాకు బ్రేక్ ఇచ్చిన సినిమా ‘వర్షం’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... త్రిష సోలో హీరోయిన్‌గా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన డైరెక్ట్ చిత్రం ‘వర్షం’. తరుణ్ హీరోగా తమిళ్, తెలుగు భాషల్లో తెరకెక్కిన ‘నీ మనసు నాకు తెలుసు’ (2003) చిత్రంలో శ్రియ ఓ హీరోయిన్ కాగా త్రిష మరో కథానాయికగా నటించారు. ప్రభాస్ హీరోగా శోభన్ దర్శకత్వం వహించిన ‘వర్షం’ చిత్రంలో సోలో హీరోయిన్‌గా నటించారు త్రిష. 2004 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ‘వర్షం’తో సూపర్‌హిట్ జోడీ అనిపించుకున్న ప్రభాస్–త్రిష ఆ తర్వాత ‘పౌర్ణమి’ (2006), ‘బుజ్జిగాడు’ (2008) వంటి చిత్రాల్లో నటించారు.
ఇక ‘వర్షం’ తర్వాత తెలుగులో త్రిష బిజీ హీరోయిన్ అయ్యారు. ఆ చిత్రం తర్వాత తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్, రవితేజ, గోపీచంద్, నితిన్, సిద్ధార్థ్ వంటి హీరోలకి జోడీగా నటించారు త్రిష. రెండు దశాబ్దాల కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించిన త్రిష ఇప్పటికీ బిజీ హీరోయిన్‌గా దూసుకెళుతున్నారు. అలాగే యువ హీరోయిన్లకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు.
ప్రస్తుతం త్రిష నటిస్తున్న తెలుగు చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా నటిస్తున్నారామె. ‘స్టాలిన్’ (2006) సినిమా తర్వాత చిరంజీవి–త్రిష కలిసి నటిస్తున్న చిత్రం ఇదే. వచ్చే ఏడాది వేసవిలో ‘విశ్వంభర’ విడుదల కానుందని టాక్. అదే విధంగా ప్రస్తుతం పలు తమిళ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు త్రిష.
Comments
Please login to add a commentAdd a comment