హైదరాబాద్: లాక్‌డౌన్ అనంతరం థియేటర్లు యాభై శాతం ప్రేక్షకులతో కొనసాగగా.. తాజాగా వంద శాతం ప్రేక్షకులతో సినిమా థియేటర్లు కొనసాగించవచ్చని తెలంగాణ రాష్ట్రం నిర్ణయం తీసుకుంది. హౌస్ ఫుల్‌కు అవకాశం కల్పించింది. ఈ మేరకు థియేటర్లలో వందశాతం ప్రేక్షకులకు అనుమతిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సినిమా థియేటర్లలో పూర్తిస్థాయిలో టికెట్లను అమ్ముకోవచ్చు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు కొనసాగవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో వంద శాతం సీట్లు భర్తీ చేసుకోవడానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. లాక్‌డౌన్ అనంతరం గతేడాది అక్టోబర్‌లో యాభై శాతం ప్రేక్షకులతో థియేటర్లు తెరుచుకున్నాయి. ప్రస్తుతం వంద శాతానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో థియేటర్ యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
యాభై శాతం ఆక్యుపెన్సీతో తాము తీవ్ర నష్టాల పాలయ్యామని గతంలో థియేటర్ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పుడు హౌస్‌ఫుల్‌కు అనుమతి ఇవ్వడంతో థియేటర్లకు పూర్వ వైభవం రానుంది. అయితే ప్రేక్షకులను వంద శాతం అనుమతిచ్చినా కరోనా నిబంధనలు మాత్రం పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. భౌతిక దూరం, మాస్క్‌లు, శానిటైజర్లు, టెంపరేచర్ చెకింగ్‌లు, షో టైమింగ్స్, బుకింగ్స్‌లో మార్పులు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే సినిమా థియేటర్లు వంద శాతం ఆక్యుపెన్సీ పెంచుకోవాలని తెలిపింది. ఈ నిర్ణయంతో థియేటర్లలో ఇప్పుడు ప్రేక్షకులతో మళ్లీ సందడి వాతావరణం ఏర్పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment