సినిమా చూపిస్తున్న'బాహుబలి'
హైదరాబాద్ : రిలీజ్ అవకముందే 'బాహుబలి' అభిమానులకు సినిమా చూపిస్తోంది. ప్రేక్షక లోకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'బాహుబలి' సినిమా ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. తొలిరోజు... మొదటి షో చూడాలన్న ఆత్రంతో ప్రభాస్ అభిమానులు, సినీ ప్రేమికులు టికెట్ల కోసం థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు. ఎక్కడ చూసినా భారీ క్యూలు కనిపిస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో అధిక శాతం సినిమా హాళ్ల వద్ద ఇదే పరిస్థితి. కౌంటర్లు తెరచిన అరగంటలోనే టికెట్లు అమ్ముడవడంతో అప్పటి వరకు బారులు తీరిన అభిమానులు నిరాశతో వెనుతిరుగుతున్నారు.
మరోవైపు టికెట్లు ముందే అమ్ముకున్నారంటూ థియేటర్ యాజమాన్యాల తీరుకు నిరసనగా కొన్నిచోట్ల అభిమానులు ఆందోళనకు దిగుతున్నారు. అదికాస్తా శృతిమించి థియేటర్లపై దాడికి కూడా దిగుతున్నారు. తాజాగా విశాఖలోని శ్రీకన్య థియేటర్పై అభిమానులు రాళ్లతో దాడి చేశారు. ఆ థియేటర్ లో బాహుబలి చిత్రాన్ని ప్రదర్శించటం లేదంటూ ఆందోళనకు దిగారు.
ఇక హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 2లోని సినీ మాక్స్‌లో టికెట్లు ముందే అమ్ముకున్నారంటూ బుధవారం అభిమానులు బైఠాయించారు. ఇక ఐమాక్స్ వద్ద తోపులాట చోటుచేసుకుంది. గేటు తీసే సమయంలో పరుగులు పెట్టిన అభిమానుల్లో కొందరు కింద పడిపోయారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.
ఆన్‌లైన్‌లోనూ అంతే...
ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేయాలని ప్రయత్నించిన వారికీ నిరాశ తప్పలేదు. దాదాపు అన్ని వెబ్‌సైట్లలోనూ టికెట్లు అమ్ముడైపోయినట్టు కనిపించడంతో అభిమానులు థియేటర్ల వద్దకు పరుగులు తీశారు. వెబ్‌సైట్ల నిర్వాహకులు ప్రేక్షకుల ఆసక్తిని 'క్యాష్' చేసుకోవాలనే ఉద్దేశంతో కావాలనే టికెట్లు అయిపోయినట్టు సైట్లలో చూపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బ్లాక్‌లో విక్రయాలు
అభిమానుల తాకిడిని చూసిన బ్లాక్ టికెట్ల విక్రయదారులు రంగంలోకి దిగారు. థియేటర్ల సిబ్బంది సహకారంతో పదుల సంఖ్యలో టికెట్లు కొనుగోలు చేసి... అందిన కాడికి దోచుకున్నారు. మరో రెండు రోజులు బ్లాక్ విక్రయాలు ఉండొచ్చని తెలుస్తోంది. ఇలాంటి వారిపై నిఘా ఉంచామని, బ్లాక్ టికెట్లు అమ్ముతూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాగా కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ వద్ద ఒకో టికెట్ ను బ్లాక్ లో 2000కు అమ్ముతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అభిమానుల మాత్రం టికెట్ ఎంతైనా కొనుక్కుని సినిమా చూసేందుకు సిద్ధపడుతున్నారు. దాంతో ప్రేక్షకుల్ని బాహుబలి మానియా ఊపేస్తోంది.
అన్నీ స్క్రీన్‌లలో...
హైదరాబాద్లో సినిమా విడుదలవుతున్న థియేటర్లు సుమారు 150 ఉంటే... 20 వరకు మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. మల్టీప్లెక్స్‌లలోని దాదాపు అన్నీ స్క్రీన్‌లలో ఇదే సినిమా ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఏ సినిమాకూ ఇలా చేయలేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.