Tuk Tuk Movie: ‘టుక్ టుక్’ మూవీ రివ్యూ | Tuk Tuk Movie Review And Rating In Telugu | Nihal Kodhaty | Saanve Megghana | Harsh Roshan | Sakshi
Sakshi News home page

Tuk Tuk Movie Review: ‘కోర్ట్’ ఫేం హర్ష్ రోషన్ నటించిన ‘టుక్ టుక్’ మూవీ ఎలా ఉందంటే?

Published Fri, Mar 21 2025 9:21 AM | Last Updated on Fri, Mar 21 2025 10:32 AM

Tuk Tuk Movie Review And Rating In Telugu

మన తెలుగమ్మాయి శాన్వి మేఘన, ఇటీవల కోర్ట్ సినిమాతో హిట్ కొట్టిన హర్ష్ రోషన్, సలార్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ దేవ్, సోషల్ మీడియా ఫేమ్ స్టీవెన్ మధు, నిహాల్ కోదాటి.. ముఖ్య పాత్రల్లో ఈ టుక్ టుక్ సినిమా తెరకెక్కింది. మూడు చక్రాల బండిని టుక్ టుక్ అంటాం. మరి ఈ సినిమాలో టుక్ టుక్ చేసిన విన్యాసాలు ఏంటి అనేది రివ్యూలో(Tuk Tuk Telugu Movie Review) చూద్దాం.    

కథేంటంటే..
ముగ్గురు టీనేజ్ కుర్రాళ్ళు(హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు) డబ్బుల కోసం వినాయకుడి విగ్రహం పెట్టి వినాయకచవితి చేస్తారు. ఆ ఊళ్ళో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఉండటం, నిమజ్జనానికి బండి దొరకకపోవడంతో ఈ ముగ్గురు కలిసి ఒక పాత స్కూటర్ ని ముగ్గురు కూర్చునే టుక్ టుక్ బండిలా తయారుచేస్తారు. ఆ బండిలోనే వినాయకుడి నిమజ్జనం ఊరేగింపు చేస్తారు. ఆ తెల్లారి నుంచి ఆ బండి దానంతట అదే ఆపరేట్ అవుతుండటంతో అందులో దేవుడు వచ్చాడు అనుకుంటారు. దీంతో స్కూటర్ లో దేవుడు ఉన్నాడు, ఏం అడిగినా హ్యాండిల్ అటు ఇటు ఊపి అవునా, కదా అని సమాధానాలు చెప్తాడు అని ఊళ్ళో ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించుకుంటారు.

ఈ క్రమంలో ఆ స్కూటర్ లో ఉంది దేవుడు కాదు ఆత్మ అని తెలుస్తుంది. ఈ ముగ్గురు కుర్రాళ్ళని కాస్త భయపెడుతుంది కూడా. మరి ఆ స్కూటర్ లో ఉన్న ఆత్మ ఎవరిది? ఆ స్కూటర్ లో ఎందుకు ఉంది? ఈ ముగ్గురు కుర్రాళ్ళు అందులో ఆత్మ ఉందని తెలిసాక ఏం చేసారు? నవీన్(నిహాల్ కోదాటి) - శిల్ప(శాన్వి మేఘన)ల ప్రేమ కథేంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
వెహికల్ దానంతట అదే ఆపరేట్ అవ్వడం, భయపెట్టడం, నవ్వించడం గతంలో తెలుగులో బామ్మ మాట బంగారు బాట, కారా మజాకా, మెకానిక్ మామయ్య లాంటి పలు సినిమాల్లో చూసాం. ఈ టుక్ టుక్ కూడా అలాంటిదే. మూడు చక్రాల బండిలో ఆత్మ ఉంటే అది ఎలాంటి విన్యాసాలు చేసింది అని సరదాగా చూపించారు. ముగ్గురు టీనేజీ కుర్రాళ్ళు ఓ బండి తయారు చేయడం, ఆ బండిలో దేవుడు ఉన్నాడు అని దాంతో డబ్బులు సంపాదించడం సీన్స్ అన్ని కాస్త నవ్విస్తూనే ఆసక్తిగా ఉంటాయి.

ఆ బండిలో ఆత్మ ఉందని తెలిసాక వాళ్ళు భయపడటం, అది వీళ్ళను పరిగెత్తించడం బానే నవ్విస్తాయి. స్కూటర్ మాట్లాడలేదు కానీ అది పిల్లలు అడిగే ప్రశ్నలకు ఇండికేషన్స్ ఇస్తూ సమాధానాలు చెప్పడం కొత్తగా ఉంటుంది. అయితే ఆ ఆత్మ కథేంటి అని ఫ్లాష్ బ్యాక్ కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. అసలు ఆ ఆత్మ అందులోకి ఎలా వచ్చింది అనేది మాత్రం సరైన క్లారిటీ ఇవ్వలేదు. లవ్ స్టోరీ కొత్తగా చూపించే ప్రయత్నం చేసారు. సెకండ్ హాఫ్ మాత్రం కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా సింపుల్ గా ముగించినట్టు అనిపిస్తుంది. హీరోయిన్ పాత్రను బాగా రాసుకున్నారు. అలాగే సినిమాలో ఓ మెసేజ్ చెప్పడానికి కూడా ప్రయత్నించారు. సినిమాకు సెకండ్ పార్ట్ కి లీడ్ ఇవ్వడం గమనార్హం.

ఎవరెలా చేశారంటే..
మన తెలుగమ్మాయి శాన్వి మేఘన తన క్యూట్ అందంతో మెప్పిస్తునే ధైర్యవంతురాలైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో చక్కగా నటించింది. ముగ్గురు టీనేజీ కుర్రాళ్ళ పాత్రల్లో హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు ఫుల్ ఎనర్జీతో నవ్విస్తూనే బాగా నటించారు. నిహాల్ కోదాటి పర్వాలేదనిపిస్తాడు. మిగిలిన పాత్రలు కూడా తమ పరిధిమేర నటించారు.

సాంకేతికంగా సినిమా పర్వాలేదు. పచ్చని లొకేషన్స్ ని సినిమాటోగ్రఫీ విజువల్స్ తో మరింత అందంగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. పాటలు కూడా వినడానికి బాగున్నాయి. టుక్ టుక్ బండిని బాగా డిజైన్ చేసారు. దర్శకుడు ఓ కొత్త పాయింట్ ని టుక్ టుక్ (Tuk Tuk Movie Review)బండితో నవ్విస్తూ చెప్పాడు. నిర్మాణవిలువలు చిన్న సినిమా అయినా ఉన్నతంగా ఉన్నాయి.

నటీనటులు: హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి.. తదితరులు
నిర్మాత: రాహుల్ రెడ్డి 
దర్శకత్వం: సి.సుప్రీత్‌ కృష్ణ
సంగీతం: సంతు ఓంకార్ 
సినిమాటోగ్రఫీ: కార్తీక్ సాయి కుమార్ 
ఎడిటర్: అశ్వత్ శివకుమార్ 
విడుదల తేది: మార్చి 21, 2025

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement