టైటిల్: ఉద్వేగం
నటీనటులు: త్రిగుణ్, దీప్సిక, శ్రీకాంత్ అయ్యంగార్, సురేష్, పరుచూరి గోపాలకృష్ణ, శివ కృష్ణ, అంజలి తదితరులు
నిర్మాతలు: జి శంకర్, ఎల్ మధు
దర్శకుడు: మహిపాల్ రెడ్డి
సంగీతం: కార్తిక్ కొడగండ్ల
సినిమాటోగ్రఫీ: జి.వి. అజయ్ కుమార్
ఎడిటర్: జశ్వీన్ ప్రభు
విడుదల తేది: నవంబర్ 29, 2024
కథేంటంటే..
మహీంద్రా (త్రిగుణ్) ఓ లాయర్. క్రిమినల్ కేసులు వాధించడంలో దిట్ట. కేసులుంటే కోర్టుకు వెళ్లడం లేదంటే ప్రియురాలు అమ్ములు(దీప్సిక)తో గడపడం..ఇదే మహీంద్ర దినచర్య. ఇలా జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో , ఓ గ్యాంగ్ రేప్ కేసు మహీంద్రా దగ్గరకు వస్తుంది. మొదట ఈ కేసు వాదించేందుకు మహీంద్రా నిరాకరిస్తాడు. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్లీ ఈ కేసును టేకాప్ చేస్తాడు. ఆ కేసులో ఏ2 అయిన సంపత్ తరపున వాదించేందుకు మహీంద్రా రంగంలోకి దిగుతాడు. ప్రత్యర్థుల తరపున వాదించేందుకు సీనియర్ లాయర్ ప్రసాద్(శ్రీకాంత్ అయ్యంగార్) రంగంలోకి దిగుతాడు.ఈ గ్యాంగ్ రేప్ మహీంద్రా జీవితంలో ఎలాంటి మలుపులు తిప్పింది? ఈ కేసులో ఎవరు గెలిచారు? చివరకు ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే..
కోర్డు డ్రామా సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. అన్నింటిలోనూ హీరో అమ్మాయిల తరపున వాదిస్తుంటాడు. కానీ హీరో బాధిత అమ్మాయిల తరపున కాకుండా నిదింతుడి తరపున వాదించడం అనేది ఈ సినిమాలో కొత్త పాయింట్. దర్శకుడు ఇలాంటి పాయింట్ ఎంచుకోవడంలోనే సగం సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అయితే కథను ప్రారంభించిన విధానం కాస్త నెమ్మదిగా ఉంటుంది.
అసలు కథను ప్రారంభించడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. హీరో చేతికి గ్యాంగ్ రేప్ కేసు వచ్చిన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. కోర్టు రూమ్ సన్నివేశాలు, ట్విస్ట్ లు ఆకట్టుకున్నాయి. అదే సమయంలో కొన్ని సన్నివేశాలు మరీ సినిమాటిక్‌గా, వాస్తవికానికి చాలా దూరంగా ఉన్నట్లు అనిపిస్తాయి. శ్రీకాంత్ అయ్యంగార్, త్రిగుణ్ మధ్య వచ్చే సన్నివేశాలను మరింత బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. నిడివి తక్కువగా ఉండడం సినిమాకు కలిసొచ్చిందనే చెప్పాలి.
ఎవరెలా చేశారంటే..
లాయర్ మహీంద్రగా త్రిగుణ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. దీప్సిక తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. త్రిగుణ్ గురువు పాత్రలో పరుచూరి గోపాలకృష్ణ ఎప్పటిలాగే తన మార్క్ చూపించారు. జడ్జిగా సీనియర్ నటుడు సురేష్ చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఇక లాయర్ ప్రసాద్‌గా శ్రీకాంత్ అయ్యంగార్ ఎప్పటిమాదిరి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సీనియర్ నటుడు శివకృష్ణ కూడా తాను పోషించిన పోలీస్ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కార్తిక్ కొడగండ్ల సంగీతం బాగుంది. జి.వి. అజయ్ కుమార్ కెమెరా పనితనం పర్వాలేదు. ఎడిటర్ జశ్వీన్ ప్రభు తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
రేటింగ్: 2.25/5
Comments
Please login to add a commentAdd a comment