నటుడు ఉపేంద్ర, శ్రియ జంటగా కన్నడంలో నటించిన చిత్రం కబ్జా. సుదీప్ ముఖ్యపాత్ర పోషించారు. కాగా నటి శ్రియ వివాహానంతరం నటించిన చిత్రం ఇది. కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం కన్నడం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. దర్శక నిర్మాత చంద్రు, నటి శ్రియ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఇది స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1970 ప్రాంతంలో జరిగే గ్యాంగ్‌స్టర్ కథా చిత్రమని చెప్పారు. కేజీఎఫ్ చిత్రం చూసి తాను ఆశ్చర్యపోయానన్నారు. ఆ చిత్ర స్ఫూర్తితోనే కబ్జా చిత్ర కథను తయారు చేసినట్లు చెప్పారు. తను ఇంతకుముందు 11 చిత్రాలు రూపొందించానని ఇది తనకు 12వ చిత్రం అని చెప్పారు.
నటుడు ఉపేంద్ర అంటే అభిమానమని, ఆయన చిత్రం చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అదే విధంగా సుదీప్ పాత్ర చిన్నదైనా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందన్నారు. నటి శ్రియ చిత్రంలో అద్భుతంగా నటించారని అన్నారు. నటి శ్రియ మాట్లాడుతూ.. తమిళనాడు చాలా నచ్చిందని.. చెన్నై అంటే చాలా ఇష్టం అని పేర్కొన్నారు. శివాజీ చిత్రంలో రజనీకాంత్ సరసన నటించడం మంచి అనుభవం అని తెలిపారు. ఆయన నటన, నిరాడంబరత, అందరితో కలిసి మెలిసి నడుచుకునే ప్రవర్తన స్పూర్తిదాయకమన్నారు.
లైట్‌మ్యాన్ నుంచి అందరికీ నమస్కారం పెట్టే సంస్కారం రజనీకాంత్‌దే అన్నారు. అలాంటి వారితో నటించడానికి ఎవరికైనా ఇష్టమేనని తెలిపారు. తానూ మళ్లీ రజనీకాంత్‌కు జోడీగా నటించాలని కోరుకుంటున్నానన్నారు. ఇప్పుడు భాష భేదం లేదని.. మంచి కథా చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో ఉన్నాయని చెప్పారు. ఈ కబ్జా చిత్రం కూడా పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుందని, ఇందులో నటించటం మంచి అనుభవంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment